ఎంఎస్‌పికి చట్టబద్ద హామీ, కుల గణన, ఉద్యోగ ఖాళీల భర్తీ -కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో

Mar 2,2024 22:10 #Congress, #manifesto

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రైతులకు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టపరమైన హామీ, దేశవ్యాప్తంగా కులగణన, ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఖాళీల భర్తీ 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రముఖంగా ఉంటాయని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. చివరి దశలో ఉన్న ముసాయిదా మేనిఫెస్టోపై చర్చించేందుకు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేతృత్వంలోని పార్టీ మేనిఫెస్టో కమిటీ ఈ నెల 4న సమావేశం కానుంది. రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని భారత్‌ జోడో న్యారు యాత్ర గత రెండు నెలలుగా ప్రధానంగా ప్రస్తావిస్తున్న యువత, మహిళలు, రైతులు, కార్మికులు, భగీదారీ (భాగస్వామ్యం)లతో కూడిన పంచన్యారు (ఐదు న్యాయ స్తంభాల)పై మేనిఫెస్టో దృష్టి సారిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శనివారం చెప్పారు. దేశవ్యాప్త కుల గణన, వారి సంఖ్యకు అనుగుణంగా హక్కులు కల్పిస్తామని హామీ ఇవ్వడం కాంగ్రెస్‌ ప్రధాన ప్రణాళికలలో ఒకటిగా ఉండనుంది. అయోధ్యలో రామమందిర ప్రారంభం, సిఎఎ తదితర హిందుత్వ అంశాలకు బిజెపి ప్రాధాన్యత ఇస్తుండగా, కుల గణనపై కాంగ్రెస్‌ కేంద్రీకరిస్తోంది. మేనిపెస్టోతో ప్రజత జీవనోపాధి సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ”ప్రభుత్వ ఖాళీల భర్తీ. కొత్త ఉద్యోగాల కల్పన, మెరుగైన వేతనాలు వంటి వాగ్దానాలు. యువత, కార్మికులకు న్యాయం చేయడంలో భాగంగా ఉంటాయి” అని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

➡️