ఎట్టకేలకు…సుప్రీం ఆదేశాలతో ఇసికి ఎన్నికల బాండ్ల వివరాలు అందజేసిన ఎస్‌బిఐ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఎన్నికల కమిషన్‌కు మంగళవారం పంపింది. సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని ఇసిఐ ధ్రువీకరించింది. ‘ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో ఫిబ్రవరి 15, మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం… ఎస్‌బిఐ నుంచి ఎలక్టోరల్‌ బాండ్స్‌ సమాచారం మంగళవారం అందింది’ అని ఇసిఐ వెల్లడించింది. మార్చి 12వ తేదీ వ్యాపార వేళలు ముగిసేలోగా ఎన్నికల బాండ్ల వివరాలను ఇసికి పంపాలంటూ సుప్రీం కోర్టు ఎస్‌బిఐని ఆదేశించింది. ఈ వివరాలన్నింటినీ మార్చి 15వ తేదీ సాయంత్రం 5గంటల కల్లా ఎన్నికల కమిషన్‌ తన అధికార వెబ్‌సైట్‌లో ప్రచురించాల్సి వుంది. 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి 30 విడతల్లో రూ.16,518 కోట్ల విలువ చేసే బాండ్లను ఎస్‌బిఐ జారీ చేసింది.

అజ్ఞాతంగా రాజకీయ నిధులను సమకూర్చుకోవడానికి అనుమతిస్తున్న ఈ ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఆ పథకాన్ని రద్దు చేస్తున్నామని ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తక్షణమే విరాళాలు అందజేసిన దాతలు, మొత్తాలు, అందుకున్న వారి వివరాలను వెల్లడించాల్సిందిగా ఆదేశించింది. ఈ వివరాలను వెల్లడించడానికి తమకు జూన్‌ 30వరకు గడువు కావాలంటూ ఎస్‌బిఐ కోరింది. దాన్ని సుప్రీం తిరస్కరించింది. మంగళవారం వర్కింగ్‌ అవర్స్‌ ముగిసేలోగా ఇసికి వివరాలన్నింటినీ అందజేయాల్సిందేనని బ్యాంక్‌ను ఆదేశించింది. రాజకీయ నిధుల్లో పారదర్శకత పెంచుతున్నామనే పేరుతో రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాల స్థానంలో ఎన్నికల బాండ్లను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2018 మార్చిలో ఎన్నికల బాండ్ల మొదటి దశ విక్రయాలు జరిగాయి. అధీకృత బ్యాంక్‌ ఖాతా ద్వారా మాత్రమే అర్హులైన రాజకీయ పార్టీ ఈ ఎన్నికల బాండ్లను నగదు రూపంలోకి మార్చుకోగలుగుతుంది. ఈ బాండ్లను జారీ చేసే అధికారం ఎస్‌బిఐకి మాత్రమే వుంది.

➡️