కేరళలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థులు వీరే!

Feb 28,2024 08:41 #condidates, #ldf, #prakatana

– సిపిఐ(ఎం)15 స్థానాల్లో పోటీ

– సిపిఐ నాలుగు,, కేరళ కాంగ్రెస్‌ (ఎం) ఒక స్థానంలో పోటీ

– విజయ రాఘవన్‌, ఐజాక్‌, ఎలమరం కరీం, శైలజ, రాధాకృష్ణన్‌ వంటి యోధులతో పటిష్టమైన లైనప్‌తో సిపిఐ(ఎం)

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేరళ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) మంగళవారం ప్రకటించింది. ఎల్‌డిఎఫ్‌ భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకుగాను సిపిఐ(ఎం)- 15 స్థానాల్లో పోటీ చేస్తోంది. సిపిఐ నాలుగు స్థానాల్లో, కేరళ కాంగ్రెస్‌ (మణి) ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. . మంగళవారం నాడు తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి గోవిందన్‌ మాస్టర్‌ తమ పార్టీ పోటీ చేస్తున్న 15 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విజయ రాఘవన్‌, ఐజాక్‌, ఎలమరం కరీం, శైలజ, రాధాకృష్ణన్‌ వంటి యోధులతో సిపిఐ(ఎం) పటిష్టమైన లైనప్‌ను కలిగిఉంది.

సిపిఎం ప్రస్తుత ఎంపి ఎఎం ఆరిఫ్‌ (అలప్పుజ), రాజ్యసభ ఎంపి, కేంద్ర కమిటీ సభ్యులు ఎలమరం కరీం (కోజికోడ్‌), సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్‌ (పాలక్కడ్‌), కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్‌ (అలత్తూరు), సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఆర్థికశాఖ మాజీ మంత్రి టిఎం థామస్‌ ఐజాక్‌ (పతనాంతిట్ట), కేంద్ర కమిటీ సభ్యులు, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కెకె శైలజ టీచర్‌ (వడకర), విద్యాశాఖ మాజీ మంత్రి సి రవీంద్రనాథ్‌ (చాలకుడి), కన్నూర్‌ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ (కన్నూర్‌), మాజీ ఎంపి జాయిస్‌ జార్జ్జి (ఇడుక్కి), వి జారు (అట్టింగల్‌), ఎం ముఖేష్‌ (కొల్లం), కెజె షైన్‌ టీచర్‌ (ఎర్నాకులం), కెఎస్‌ హంజా (పొన్నాని), డివైఎఫ్‌ఐ నాయకుడు వి వాసిఫ్‌ (మలప్పురం), ఎంవి బాలకృష్ణన్‌ మాస్టర్‌ (కాసర్‌గోడ్‌) సిపిఎం తరపున పోటీ చేస్తున్నారు.

సిపిఐ నుంచి అనీరాజా (వయనాడ్‌), ఎస్‌ పన్నయన్‌ రవీంద్రన్‌ (తిరువనంతపురం), ఎస్‌ సిఎ అరుణ్‌ కుమార్‌ (మావెలిక్కర), విఎస్‌ సునీల్‌కుమార్‌ (త్రిసూర్‌) పోటీ చేస్తారు. కేరళ కాంగ్రెస్‌ (మణి) నుంచి థామస్‌ చాజిక్కడన్‌ (కొట్టాయం) ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.ఎల్‌డిఎఫ్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన యుడిఎఫ్‌ తన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ముస్లిం లీగ్‌ డిమాండ్‌ చేస్తున్న మూడో సీటుపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి.

బిజెపిని అధికారంలోకి రానీయకుండా చేసేందుకు సిపిఐ(ఎం) ప్రయత్నిస్తోందని గోవిందన్‌ అన్నారు. బిజెపి ముందంజలో ఉందంటూ కార్పొరేట్‌ మీడియా ఊదరగొడుతోందని, అది నిజం కాదని ఆయన అన్నారు. కార్పొరేట్‌ా హిందూత్వ ఎజెండాకు ప్రత్యామ్నాయంగా వామపక్ష లౌకిక శక్తులు ముందుకొస్తున్నాయని గొవిందన్‌ అన్నారు. .

➡️