10 రాష్ట్రాలు 96 లోకసభ స్థానాలు.. నేడు నాలుగో విడతకు సర్వం సిద్ధం

ఎపిలో 175, ఒరిస్సాలో 28 అసెంబ్లీ సీట్లకూ
17.7 కోట్ల ఓటర్లు
1.92 లక్షలు పొలింగ్‌ కేంద్రాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సోమవారం నాలుగో విడత పోలింగ్‌ కు సర్వసిద్ధమైంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 96 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒరిస్సాలో 28 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అయితే తెలంగాణలో ఓటింగ్‌ ను బట్టి సమయాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 96 లోక్‌సభ స్థానాల్లో 64 జనరల్‌ 12 ఎస్‌టి, 20 ఎస్‌సి స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో 139 జనరల్‌, 7 ఎస్‌టి, 29 ఎస్‌సి స్థానాలు ఉన్నాయి. ఒరిస్సాలోని 28 అసెంబ్లీ స్థానాలలో 11 జనరల్‌, 14 ఎస్‌టి, 3 ఎస్‌సి స్థానాలు ఉన్నాయి.10 రాష్ట్రాల్లో 1,717 మంది అభ్యర్థులు లోకసభ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
నేడు పోలింగ్‌ జరిగే 96 లోక్‌సభ స్థానల్లో 17.70 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 8.97 కోట్ల మంది పురుషులు, 8.73 కోట్ల మహిళల ఓటర్లు ఉన్నారు.12.49 లక్షల మంది 85 ఏళ్లు పైబడి ఉన్నారు.19.99 లక్షల మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. 1.92 లక్షల పొలింగ్‌ కేంద్రాలు వుండగా వాటిలో 19 లక్షల అధికారులు బాధ్యతలు నిర్వహించనున్నారు.
దేశ వ్యాప్తంగా 364 మంది పరిశీలకులు ఉన్నారు. అందులో 126 సాధారణ, 70 మంది పోలీసు, వ్యయ పరిశీలకులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 4,661 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 4,435 మంది స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌, 1,710 వీడియో సర్వేలెన్స్‌ టీమ్స్‌, 934 వీడియో వ్యూవింగ్‌ టీమ్స్‌ ఎన్నికల పనుల్లో ఉన్నాయి. 1,016 అంతరాష్ట్ర, 121 అంతర్జాతీయ సరిహద్దుల చెక్‌ పోస్ట్‌ ల వద్ద తనిఖీలు ఏర్పాటు చేశారు.

➡️