ఉన్నత విద్య నుంచి 13వేల మంది అణగారిన విద్యార్థులు అవుట్‌ !

న్యూఢిల్లీ: దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల నుంచి గడచిన అయిదేళ్లలో 13వేల మంది ఎస్సీ, ఎస్టీ,ఓబిసి విద్యార్థులు చదువుకు మధ్యలో ఆపేసి బయటకొచ్చేశారు. లోక్‌సభలో బిఎస్పీ సభ్యుడు రూపేశ్‌ పాండే అడిగిన ప్రశ్నకు విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ సమాధానమిస్తూ ఈ సంగతి వెల్లడించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా భావించే ఐఐటి, ఐఐఎం, సెంట్రల్‌ యూనివర్సిటీల నుంచి అందిన డేటా ప్రకారం 4,596 మంది ఓబిసి విద్యార్థులు, 2,424 మంది ఎస్సీ, 2622 మంది ఎస్టీ విద్యార్థులు సెంటల్‌ యూనివర్సిటీల నుంచి ఈ అయిదేళ్లలో డ్రాపవుటయ్యారు. ఐఐటి,ల నుంచి 2,066 మంది ఓబిసి విద్యార్థులు, 1,068 మంది ఎస్సీ విద్యార్థులు, 408 మంది ఎస్టీ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేయకుండానే వెళ్లిపోయారు. ఐఐఎంలలో 163 మంది ఓబిసి విద్యార్థులు, 188 మంది ఎస్సీలు, 91 మంది ఎస్టీ విద్యార్థులు డ్రాపవుట్‌ అయ్యారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో డ్రాపవుట్స్‌కు సంబంధంచి ఎలాంటి సమాచారం తన వద్ద లేదని మంత్రి తెలిపారు. ఈ డ్రాపవుట్లకు కారణం విద్యార్థుల పేదరికమేనని మంత్రి తేల్చేశారు.

➡️