ఇజ్రాయిల్‌కు 6 వేల మంది కార్మికులు!

Apr 11,2024 23:44 #Employed Workers, #issrel
  •  ఉద్రిక్త పరిస్థితులున్నా.. ఉపాధి కోసం వెళ్తున్న యువత

న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్‌ దారుణంగా దాడులకు పాల్పడుతున్న వేళ భారత్‌ నుంచి ఆ దేశానికి ఆరు వేల మందికిపైగా కార్మికులు వెళ్లనున్నారు. తక్కువ వ్యవధిలో ఇజ్రాయిల్‌ నిర్మాణ రంగానికి వస్తున్న విదేశీ కార్మికుల సంఖ్యలో ఇదే అత్యధికం. ఈ విషయాన్ని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్‌-మే నెలల్లో ఈ కార్మికులంతా ఇజ్రాయిల్‌ చేరుకుంటారని, దేశ నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న కార్మికుల కొరతను తీర్చడానికి సహాయపడతారని తెలిపింది. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, నిర్మాణం-గృహ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్న ‘ఎయిర్‌ షెటిల్‌’ ద్వారా ఈ కార్మికులను దేశానికి తీసుకొస్తామని వెల్లడించింది. పాలస్తీనాకు చెందిన సుమారు 80 వేల మంది కార్మికులను ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తొలగించడంతో ఇజ్రాయిల్‌ నిర్మాణ రంగం తీవ్రంగా కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది.
ఇలాంటి సమయంలో అత్యధికంగా ఆరు వేల మందికిపైగా విదేశీ కార్మికులు రానుండటం ఇదే మొదటిసారని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (జి టూ జి) ఒప్పందం ప్రకారం భారత్‌ నుంచి కార్మికులు వస్తున్నారని తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గత మంగళవారం భారత్‌ నుంచి 64 మంది నిర్మాణ కార్మికులు ఇజ్రాయిల్‌కు చేరుకున్నారు. రాబోయే వారాల్లో వరుసగా కార్మికులు వస్తారని తెలిపింది. ఇజ్రాయిల్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఐసిఎ) ఈ కార్మికుల కోసం జాబ్‌ మేళాలు నిర్వహించి, వారిని తీసుకొస్తోంది. ఈ జాబ్‌ మేళాల్లో ఎంపికైన కార్మికులు ఇజ్రాయిల్‌ రావడానికి వీసా కోసం ఎదురుచూస్తున్నారని ఐసిఎ తెలిపింది. భారత్‌, శ్రీలంకల నుంచి సుమారు 20 వేల మందిని నియమించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రధానమంత్రి మోడీతో ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడినప్పుడు భారతీయ కార్మికుల రాకపై చర్చించారు.
ఇజ్రాయిల్‌ నరమేధంతో కార్మికుల కొరత
గత ఏడాది అక్టోబర్‌ నుంచి గాజాపై బీకర దాడులు చేస్తూ, వేల మందిని పొట్టనపెట్టుకున్న ఇజ్రాయిల్‌ అక్కడ పౌరులను బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. దీతో, ఇజ్రాయిల్‌లో అనేక రంగాలు తీవ్రంగా మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌ వంటి దేశాల నుంచి కార్మికులను తమ దేశానికి రప్పించుకుంటుంది.
ప్రాణాలకు ముప్పున్నా…
మోడీ సర్కారు పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. దీంతో, ఇజ్రాయిల్‌లో ప్రాణాలకు ముప్పు ఉందని, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్టు తెలిసినా అక్కడికి పనుల కోసం వెళ్లేందుకు వేలాదిమంది సిద్ధమవుతున్నారు. ఇజ్రాయిల్‌ దాడులకు ప్రతీకారంగా కొన్ని సంస్థలు దాడులు నిర్వహిస్తూనే ఉన్నాయి. మార్చి 4న ఉత్తర ఇజ్రాయిల్‌లో పనులు చేసేందుకు వెళ్లిన కేరళకు చెందిన పాట్‌ నిబిన్‌ మాక్స్‌వెల్‌ ఇటువంటి దాడుల్లోనే మరణించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా నిర్వహించిన రాకెట్‌ దాడిలో మాక్స్‌వెల్‌ మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయిల్‌ దుర్మార్గాలకు మద్దతిస్తున్న మోడీ సర్కారు…. ఇండియాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రమాదకర పరిస్థితులున్న దేశాలకు కార్మికులను పంపిస్తోంది.

➡️