రాజస్థాన్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

Jan 9,2024 09:58 #BJP, #Rajasthan, #setback
  • ఉప ఎన్నికలో మంత్రి ఓటమి

జైపూర్‌ : రాజస్థాన్‌లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు కూడా గడవక ముందే బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరణ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి, రాష్ట్ర మంత్రి సురేంద్ర పాల్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రూపేందర్‌ సింగ్‌ కూనర్‌ చేతిలో 11,283 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌ సింగ్‌ కూనర్‌ మరణించడంతో ఈ నెల 5న ఉప ఎన్నిక నిర్వహించి, సోమవారం ఫలితాలను ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, గుర్మీత్‌సింగ్‌ కుమారుడు రూపేందర్‌ సింగ్‌ కూనర్‌కు 94,950 ఓట్లు, మంత్రి సురేంద్ర పాల్‌ సింగ్‌కు 83,667 ఓట్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. రూపేందర్‌ సింగ్‌ కూనర్‌ మీడియాతో మాట్లాడుతూ కరణ్‌పూర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చారు. కానీ ప్రజలు వారిని తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు’ అని తెలిపారు.

➡️