ప్రతి అవయవ మార్పిడికి విశిష్ట గుర్తింపు సంఖ్య

  •  తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ : జీవించివున్న దాతల నుంచి కానీ, మరణానంతరం దాతల నుంచి కానీ అవయవాల మార్పిడికి సంబంధించిన ప్రతీ కేసుకూ ఆధార్‌ తరహా ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌ఒటిటిఒ-నొట్టో) ద్వారా ఈ గుర్తింపు కేటాయించనున్నట్లు తెలిపింది. అవయవ మార్పిడి చికిత్స నిర్వహించే సంబంధిత ఆసుపత్రులే ‘నొట్టో వెబ్‌సైట్‌’ ద్వారా ఈ గుర్తింపు సంఖ్యను జారీ చేయవచ్చునని పేర్కొంది. అవయవాల అమ్మకానికి, ప్రత్యేకించి విదేశీ అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘మరణానంతరం అవయవ దానాలను పరిగణనలోకి తీసుకోవడానికి నొట్టో ఐడి గుర్తింపు తప్పనిసరి. జీవించి ఉన్న దాత నుంచి అవయవదానం విషయంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన 48 గంటల్లోపు నొట్టో గుర్తింపు జారీ చేయాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం 1994 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న అథారిటీలు ఆయా రాష్ట్రాల్లో విదేశీయులకు జరిగిన అవయవ దానాలపై దర్యాప్తు నిర్వహించాలని ఈ నెల ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్లు అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి తక్షణమే తగిన చర్యలు కోవాలని ఆదేశించింది.

➡️