సమానత్వం, క్లెమేట్‌ జస్టిస్‌ ఆధారంగావాతావరణ మార్పులపై చర్యలు : భారత్‌

Dec 10,2023 11:20 #Climate Changes, #equity, #India, #justice

దుబాయ్ : సమానత్వం, క్లెమేట్‌ జస్టిస్‌ ఆధారంగా వాతావరణ మార్పులపై చర్యలు ఉండాలని ధృఢంగా విశ్వసిస్తున్నట్లు భారత్‌ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన దేశాలే నాయకత్వం వహించాలని, అప్పుడే ఇది సాధ్యమవుతుందని భారత్‌ పేర్కొంది. దుబాయ్ లో శనివారం కాప్‌ 28 సదస్సులో భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. లక్ష్యంగా నిర్ణయించుకున్న సంవత్సరం (2030) కంటే 11 ఏళ్లు ముందుగానే ఉష్ణోగ్రత పెరుగుదలను నియంత్రించే ఉద్గార తీవ్రతను 33 శాతం వరకూ భారత్‌ తగ్గించిందని మంత్రి ప్రముఖంగా తెలిపారు. పునరుత్పాదక ఇంధన విషయంలో కూడా లక్ష్యం కంటే తొమ్మిదేళ్లు ముందుగానే అంచనాలను భారత్‌ అందుకుందని తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రహం అనే ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేయడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని మంత్రి సదస్సుకు తెలిపారు. ఐరాసకు చెందిన ఎఫ్‌సిసిసి ఆధ్వర్వంలో జరుగుతున్న ఈ కాప్‌ 28 సదస్సు ఈ నెల 12తో ముగియనుంది.

➡️