అదానీ బొగ్గు కుంభకోణం కేసు – సత్వర విచారణకు డిమాండ్‌

May 25,2024 08:27
  • భారత ప్రధాన న్యాయమూర్తికి 21 అంతర్జాతీయ సంస్థల లేఖ

న్యూఢిల్లీ : అదానీ బొగ్గు దిగుమతుల కుంభకోణం కేసుపై సత్వరమే విచారణ జరిపించాలని 21 అంతర్జాతీయ సంస్థలు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కోరాయి. ఈ మేరకు ఆ సంస్థలు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌కు శుక్రవారం సంయుక్తంగా ఒక లేఖ రాశాయి. ఇండోనేషియా బొగ్గు దిగుమతులకు సంబంధించి అదానీ గ్రూప్‌ సంస్థలపై విచారణ జరిపి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ దాఖలు చేసిన కేసు పెండింగ్‌లో ఉందని, దానిని త్వరగా పరిష్కరించాలని 21 అంతర్జాతీయ సంస్థలు సిజెఐను అభ్యర్థించాయి. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఒసిసిఆర్‌) నివేదిక ఆధారంగా ఫైనాన్షియల్‌ టైమ్స్‌తో సహా మరికొన్ని జాతీయ పత్రికలు ఈ స్కామ్‌పై పలు కథనాలను ఇప్పటికే ప్రచురించాయి. 2014లో ఇండోనేషియా నుంచి నాసిరకం బొగ్గును దిగుమతి చేసుకుని, ఇక్కడ దానిని మూడు రెట్లు అధిక ధరకు అదానీ గ్రూపు విక్రయించింది. సుమారు రూ.30 వేల కోట్ల అదనపు లాభాన్ని ఆర్జించినట్లు అదానీ గ్రూపు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ కేసును త్వరగా విచారించాలని సిజెఐని అభ్యర్థించిన సంస్థల్లో ఆస్ట్రేలియన్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జస్టిస్‌, బ్యాంక్‌ట్రాక్‌, బాబ్‌ బ్రౌన్‌ ఫౌండేషన్‌, కల్చర్‌ అన్‌స్టెయిన్డ్‌, ఎకో, ఎక్స్‌టింక్షన్‌ రెబెల్లియన్‌, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ ఆస్ట్రేలియా, లండన్‌ మైనింగ్‌ నెట్‌వర్క్‌, మాకే కన్జర్వేషన్‌ గ్రూప్‌, మార్కెట్‌ ఫోర్సెస్‌, మనీ రెబెల్లియన్‌, మూవ్‌ బియాండ్‌ కోల్‌, సీనియర్స్‌ ఫర్‌ క్లైమేట్‌ యాక్షన్‌ నౌ, స్టాండ్‌ ఎర్త్‌, స్టాప్‌ అదానీ, సన్‌రైజ్‌ మూవ్‌మెంట్‌, టిప్పింగ్‌ పాయింట్‌, టాక్సిక్‌ బాండ్స్‌, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఆస్ట్రేలియా, డబ్ల్యూ అండ్‌ జె నగానా యార్‌బైన్‌ కల్చరల్‌ కస్టోడియన్స్‌, క్వీన్స్‌లాండ్‌ కన్జర్వేషన్‌ కౌన్సిల్‌ ఉన్నాయి. ఈ స్కామ్‌పై తాము అధికారంలోకి రాగానే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ చేస్తామని కాంగ్రెస్‌ ఇప్పటికే హామీ ఇచ్చింది. అలాగే, బొగ్గు దిగుమతుల విషయంలో అదానీ గ్రూప్‌పై విచారణను పున:ప్రారంభించాలన్న తన వైఖరిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ గతంలోనే అఫిడవిట్‌లో పునరుద్ఘా టించింది. 2011, 2015 మధ్య ఇండోనేషియా నుండి బొగ్గు దిగుమతులపై 2016లో మార్చిలోనే అదానీ గ్రూప్‌ కంపెనీలపై విచారణను ప్రారంభించింది.

➡️