గాజా యుద్ధంలో అదానీ డ్రోన్లు !

Feb 14,2024 09:50
  • ఇజ్రాయిల్‌కు విక్రయించిన హైదరాబాద్‌ కంపెనీ
  • ఇప్పటికే 20కి పైగా యుఎవిల సరఫరా

న్యూఢిల్లీ : గాజాలో సాగిస్తున్న మారణహోమంలో అదానీ గ్రూప్‌ భాగస్వామ్య కంపెనీ తయారు చేసిన డ్రోన్లను ఇజ్రాయిల్‌ ఉపయోగిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అదానీ – ఎల్బిట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలో అదానీ గ్రూపుకు మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి భాగస్వామ్య కంపెనీ ఇజ్రాయిల్‌కు 20కి పైగా సైనిక డ్రోన్లను సరఫరా చేసింది. ఇజ్రాయిల్‌ అమానుష చర్యలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. గత నాలుగు నెలలుగా గాజాలోని పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ సైన్యం యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి భాగస్వామ్య కంపెనీ తయారు చేస్తున్న డ్రోన్ల తరహాలోనివే హెర్మస్‌ డ్రోన్లు. వీటిని ఇప్పటికే గాజాలో ఉన్న ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు విస్తృతంగా యుద్ధంలో ఉపయోగిస్తున్నాయి. ఈ మారణకాండలో పది వేల మంది చిన్నారులు సహా 28 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఓ మోస్తరు ఎత్తు ఉండే ఈ మానవ రహిత గగనతల వాహనాల (యుఎవి) విక్రయం వ్యవహారం ఈ నెల 2న వెలుగులోకి వచ్చింది. నీలం మాథ్యూస్‌ అనే వ్యక్తి రక్షణ రంగానికి చెందిన షెపర్డ్‌ మీడియా వెబ్‌సైట్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సమాచారాన్ని ఇప్పటి వరకూ రెండు దేశాలు ధ్రువీకరించలేదు. అదానీ గ్రూపులో పేరు చెప్పడానికి ఇష్టపడని కొన్ని వర్గాలు మాత్రం డ్రోన్ల విక్రయం జరిగిందని స్పష్టం చేశాయి. ఈ డ్రోన్లను గాజాలో జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దాడికి ఉపయోగిస్తారని సమాచారం. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని మోడీ ప్రభుత్వం ఓ వైపు అధికారికంగా ఇరు పక్షాలనూ కోరుతుంటే, మరోవైపు ప్రధానికి అత్యంత సన్నిహితుడైన అదానీకి చెందిన కంపెనీ ఇజ్రాయిల్‌కు డ్రోన్లు సరఫరా చేయడం గమనార్హం. ఇజ్రాయిల్‌కు ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్ల విడిభాగాల విక్రయాన్ని వెంటనే నిలిపివేయాలని హేగ్‌ న్యాయస్థానం సోమవారం నెదర్లాండ్స్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అమ్మకం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. అయినప్పటికీ అదానీ గ్రూపు భాగస్వామ్య కంపెనీ ఇజ్రాయిల్‌కు డ్రోన్ల అమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉంది.

2018లో ఇజ్రాయిల్‌కు చెందిన ఎల్బిట్‌ సిస్టమ్స్‌ కంపెనీ అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌తో ఉమ్మడి భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో ఇజ్రాయిల్‌ కంపెనీకి 49% వాటాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయిల్‌ వెలుపల తొలిసారిగా హైదరాబాదులో యుఎవిల ఉత్పత్తి కోసం పదిహేను మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఓ సంస్థ ఏర్పడింది. డ్రోన్ల అమ్మకం వ్యవహారంపై ఇజ్రాయిల్‌ రక్షణ సంస్థ సరైన సమాధానం చెప్పడం లేదు. కాంట్రాక్టులు, సరఫరాదారులు, వినియోగదారులకు అందజేసే పరికరాలపై ఎల్బిట్‌ సిస్టమ్స్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని మాత్రం చెబుతోంది. హైదరాబాదులో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని అదానీ సంస్థలో యుఎవిని పూర్తి స్థాయిలో తయారు చేశారని షెపర్డ్‌ మీడియా తెలిపింది. యుఎవిల తయారీకి అవసరమైన హెర్మస్‌-900 కిట్లతో పాటు సెన్సార్లు, ఇంజిన్లు వంటి పరికరాలను కూడా భారత్‌కు ఎల్బిట్‌ అందజేసిందని వివరించింది.

గత సంవత్సరం అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి చేసిన తర్వాత గాజాలో సైనిక చర్య ప్రారంభమైంది. ఇందులో హెర్మస్‌-900 డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఈ డ్రోన్లను నిఘా కోసమే కాకుండా గాజాలో చిన్నపాటి బాంబులు వేసేందుకు కూడా ఇజ్రాయిల్‌ సైనికులు వినియోగిస్తున్నారు.

➡️