యుపిలో కాంగ్రెస్‌కు 15 సీట్లే .. అఖిలేష్‌ యాదవ్‌ కండీషన్

Feb 19,2024 16:12 #akhilesh yadav, #Congress, #INDA bloc

లక్నో :    యుపిలో 15 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ను పోటీ చేసేందుకు అనుమతిస్తామని సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 52 స్థానాలు మాత్రమే దక్కాయి. వాటిలో ఈశాన్య రాష్ట్రాల స్థానాలు తక్కువగానే ఉన్నాయి. యుపిలోని అమేథీ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఓటమిపాలవగా, రారుబరేలి సీటు మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకుంది.

2019లో కాంగ్రెస్‌పై గౌరవంతో ఆ రెండు స్థానాల్లోనూ ఎస్‌పి పోటీ చేయలేదు. అయితే ఈ సారి కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇస్తామని స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పొత్తు కుదిరితే ఇతరస్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయలేమని తేల్చి చెప్పాల్సి వుంది. ఇప్పుడు బంతి కాంగ్రెస్‌ చేతిలో ఉంది. ఈ విషయంపై స్పందించాల్సి వుంది.

కాగా, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్  యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈనెల 16న వారణాసిలోకి ప్రవేశించిన యాత్ర.. 21 వరకు కొనసాగనుంది. ఈ రోజు అమేథీ నియోజకవర్గంలోకి రాహుల్‌ యాత్ర ప్రవేశించనుంది. ఈ యాత్రలో అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొనడం  కూడా కాంగ్రెస్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.  ప్రస్తుతం సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో తమ పార్టీ చర్చలు జరుపుతోందని, సీట్ల పంపకాలు పూర్తయ్యాక భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటానని  అఖిలేష్‌యాదవ్‌ తేల్చిచెప్పారు.

ఇప్పటికే జెడియు అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ ఇండియా ఫోరం నుంచి బయటకు వెళ్లిపోయారు. అఖిలేష్‌ యాదవ్‌ కూడా కూటమిని వీడుతారా అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో .. సీట్ల పంచాయితీ తేలాకే రాహుల్‌ను కలుస్తానని అఖిలేష్‌ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం గమనార్హం. కాగా, మరో రెండు రోజుల్లో రాహుల్‌ యాత్ర యుపిలో ముగియనుంది. ఈ రెండ్రోజుల్లోనైనా అఖిలేష్‌  యాత్రలో పాల్గొంటారా? లేదా అనేది చూడాల్సి వుంది.

➡️