మరో 78 మంది ఎంపీలపై వేటు

Dec 19,2023 13:42 #MPS, #Parlament, #Suspension
  • రాజ్యసభలో 45, లోక్‌సభలో 33 మంది సస్పెన్షన్‌
  • పార్లమెంటు చరిత్రలోనే అసాధారణం
  • గందరగోళం మధ్యే బిల్లుల ఆమోదం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు చరిత్రలోనే అసాధారణమైన రీతిలో ప్రతిపక్ష ఎంపీలపై మోడీ ప్రభుత్వం మూకుమ్మడిగా సస్పెన్షన్‌ వేటు వేసింది. గత వారం 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయగా, తాజాగా సోమవారం మరో 78 మంది ఎంపీలను ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్‌ చేసింది. వీరిలో కొందరిపై సస్పెన్షన్‌ ప్రివిలైజెస్‌ కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు విధించారు. ఆ నివేదిక రావడానికి ఎంత కాలం పడితే అంతకాలం వీరి సస్పెన్షన్‌ కొనసాగుతుందన్నమాట. మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలు అంతకంతకూ శ్రుతిమించిపోతున్నాయనడానికి ఇదొక నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శించాయి. పార్లమెంటు భద్రతను ప్రమాదంలో పడవేసేలా గత వారం లోక్‌సభలో చోటుచేసుకున్న ఘటనపై సభలో చర్చ కోసం పట్టుబట్టడం, భద్రతా వైఫల్యంపై ప్రధాని, కేంద్ర హౌం మంత్రి సభకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరడమే నేరమన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పార్లమెంటుకు జవాబుదారీ వహించాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయకుండా తమ నోరునొక్కేందుకు యత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రెండో విడత సస్పెన్షన్‌ వేటు పడిన 78 మంది ఎంపీలలో 45 మంది రాజ్యసభకు చెందినవారు కాగా, మిగతావారు లోక్‌సభ సభ్యులు. వీరిలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి కూడా ఉన్నారు. ఈ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ప్రతిపక్ష ఎంపీిలను సస్పెండ్‌ చేయడం పార్లమెంట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఎంపిలు కె జయకుమార్‌, విజరు వసంత్‌, అబ్దుల్‌ ఖలీక్‌లను లోక్‌సభలో స్పీకర్‌ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారని ఆరోపిస్తూ ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్‌ చేశారు. రాజ్యసభలో 11 మందిని ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్‌ చేశారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రివిలేజెస్‌ కమిటీకి సూచించారు. ప్రివిలేజెస్‌ కమిటీకి నివేదించిన వారిలో జెబి మాథర్‌ హిషామ్‌, ఎల్‌ హనుమంతయ్య, నీరజ్‌ డాంగి, రాజమణి పటేల్‌, కుమార్‌ కేత్కర్‌, జిసి చంద్రశేఖర్‌, బినోరు విశ్వం, పి సంతోష్‌ కుమార్‌, మొహ్మద్‌ అబ్దుల్లా, జాన్‌ బ్రిట్టాస్‌, ఎఎ రహీమ్‌ ఉన్నారు. సభలో గందరగోళం మధ్యే ప్రభుత్వం కీలకమైన మూడు బిల్లులను మూజువాణి ఓటుతో మమ అనిపించుకుంది. లోక్‌సభ ప్రారంభం కాగానే పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని, ప్రధాని మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపిలు పట్టుపట్టారు. అందుకు ప్రభుత్వం ఎప్పటిలానే తిరస్కరించింది. దీంతో పతిపక్ష ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా సభను పలుమార్లు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు మొదట వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే టెలి కమ్యూనికేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. తరువాత రెండు సార్లు వాయిదా పడి చివరికి మంగళవారానికి వాయిదా పడింది.

రాజ్యసభలోనూ.. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై చర్చించాలని పట్టుపట్టారు. అందుకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. దీంతో సభను 11:30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను రాజ్యసభ ఛైర్మన్‌ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరారు జమ్ముకాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లు, 2023, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు 2023ను రాజ్యసభలో పరిశీలన, ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. ఆ రెండు బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం సభ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసా గింది. దీంతో సాయంత్రం 4:30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో 45 మంది ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్‌ చేశారు. అనంతరం మంగళవారం నాటికి సభను వాయిదా వేశారు.

పార్లమెంట్‌ ప్రవేశ ద్వారం వద్ద సస్పెన్షన్‌ – ఎంపిల ఆందోళన

మరోవైపు సస్పెన్షన్‌కు గురైన ఎంపిలు పార్లమెంట్‌ ప్రవేశ ద్వారం మెట్లపై కూర్చుని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సభలోకి అడుగుపెట్టేటప్పుడు నిరసన తెలుపుతున్న ఎంపిలను కలిసి, మద్దతు తెలిపారు.

  ఏ పార్టీల వారు ఎంతమంది ?

లోక్‌సభలో సస్పెన్షన్‌కు గురైన 33 మంది ఎంపిలలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది, డిఎంకె, టిఎంసిలకు చెందిన తొమ్మిది మంది చొప్పున, ఐయుఎంఎల్‌కు చెందిన ఇద్దరు, ఆర్‌ఎస్‌పికి చెందిన ఒకరు, జెడియుకు చెందిన ఒకరు ఉన్నారు. రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన 45 మంది ఎంపిలలో కాంగ్రెస్‌కు చెందిన 18 మంది, టిఎంసికి చెందిన ఏడుగురు, డిఎంకెకు చెందిన ఐదుగురు, సిపిఎంకు చెందిన ముగ్గురు, సిపిఐ, ఆర్‌జెడి, జెడియు, ఎస్‌పిలకు చెందిన ఇద్దరేసి, ఎన్‌సిపి, జెఎంఎం, కేరళ కాంగ్రెస్‌ ఎం, ఎంజిఎంకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. సిపిఎం నుంచి సస్పెన్షన్‌కు గురైన ముగ్గురిలో వి.శివదాసన్‌, జాన్‌ బ్రిట్టాస్‌, ఎఎ రహీమ్‌ ఉన్నారు.

ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదు : హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌

ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని ఎస్‌ఎడి ఎంపి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అన్నారు. ‘ఇది పెద్ద భద్రతా లోపం, ఇంటెలిజెన్స్‌ వైఫల్యం.. ఇది ఎలా జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రశ్నలు అడిగిన వారిని సస్పెండ్‌ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదు’ అని ఆమె అన్నారు.

ప్రతిపక్షం లేని సభ : ఖర్గే

రాజ్యసభలో మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. ‘మొదట, చొరబాటుదారులు పార్లమెంటుపై దాడి చేశారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌, ప్రజాస్వామ్యంపై దాడి చేసింది. 47 మంది ఎంపిలను సస్పెండ్‌ చేయడంతో నిరంకుశ మోడీ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను చెత్తబుట్టలో పడవేస్తోంది’ అని విమర్శించారు. పార్లమెంట్‌ భద్రతలో క్షమించరాని ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేయాలి. దీనిపై సవివరమైన చర్చ జరగాలి. ప్రధాని మోడీ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వవచ్చు. హోంమంత్రి టివి ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. కానీ, భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటుకు వారి జవాబుదారీతనం సున్నా. ‘ప్రతిపక్షాలు లేని పార్లమెంటుతో, మోడీ ప్రభుత్వం ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన చట్టాలను బుల్డోజ్‌ చేయగలదు. ఎలాంటి అసమ్మతిని ఎలాంటి చర్చ లేకుండానే అణచివేయగలదు’ అని విమర్శించారు.

➡️