మరో హైజాక్‌ యత్నం భగ్నం

Jan 31,2024 11:05 #Another, #attempt, #foiled, #hijack
  • 19 మంది పాక్‌ సిబ్బందిని రక్షించిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర

న్యూఢిల్లీ : 36 గంటల వ్యవధిలోనే మరొక హైజాక్‌ యత్నాన్ని భారత నౌకదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ సుమిత్ర భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 19 మంది సిబ్బందిని రక్షించింది. మంగళవారం ఉదయం నౌకా దళం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఈ నెల 29న ఇరాన్‌ జెండాతో ఉన్న చేపలు పట్టే నౌకను దక్షిణ అరేబియా సముద్రంలో హైజాక్‌ చేయడానికి 11 మంది సోమాలియా సముద్రపు దొంగలు ప్రయత్నించారు. నౌకలో ఉన్న 19 మంది సిబ్బందిని బందీలుగా చేసుకున్నారు. సమాచారం అందుకున్న భారత నౌక దళ అధికారులు గల్ఫ్‌ ఆఫ్‌ అడెన్‌ ప్రాంతంలో మోహరించివున్న ఐఎన్‌ఎస్‌ సుమిత్రను రంగంలోకి దించారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర హైజాక్‌ యత్నాన్ని భగం చేసింది. 19 మంది సిబ్బందిని సురక్షితంగా విడిపించింది. 17 మంది సిబ్బందితో ఉన్న ఇరాన్‌ నౌకను సముద్రపు దొంగలు హైజాక్‌ చేయకుండా ఐఎన్‌ఎస్‌ సుమిత్ర నిరోధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంఘటనలు కొచ్చికి పశ్చిమంగా సుమారు 850 నాటికన్‌ మైళ్ల దూరంలోని దక్షిణ అరేబియా సముద్రంలో సంభవించాయి.

➡️