తెరపైకి మరో స్పైవేర్‌

Dec 27,2023 11:09 #Modi Sarkar, #screen, #spyware
  • ఎన్‌ఎస్‌్‌ఒకు ప్రత్యామ్నాయంగా కాగ్నైట్‌తో మోడీ ప్రభుత్వ ఒప్పందం !
  • దేశంలో పనిచేస్తున్న నాలుగు అనుబంధ సంస్థలు

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ విక్రయించిన పెగాసస్‌ కంటే తక్కువ స్థాయి కలిగిన స్పైవేర్‌ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఓ అనుబంధ కంపెనీకి మన దేశంలో కార్యాలయాలు ఉన్నట్లు తెలిసింది. నూతన స్పైవేర్‌పై రూ.986 కోట్లు ఖర్చు చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక మార్చిలోనే తెలియజేసింది. పెగాసస్‌ సైనిక శ్రేణి స్పైవేర్‌. ఫోన్ల సాయంతో అది లక్ష్యాలపై నిఘా పెట్టగలదు. పెగాసస్‌ లక్ష్యాలలో పాత్రికేయులు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ విమర్శకులు, హక్కుల కార్యకర్తల ఫోన్‌ నెంబర్లు ఉన్నాయని ఫ్రెంచ్‌ మీడియా గతంలోనే బయటపెట్టింది.

పెగాసస్‌ను విక్రయించిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు ప్రత్యామ్నాయంగా కేంద్రం వెతుకుతున్న కంపెనీల జాబితాలో తాజాగా ‘కాగ్నైట్‌’ చేరింది. దీని మరో పేరు వెరియంట్‌. సైప్రస్‌కు చెందిన ఆరు ఆఫ్‌షోర్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల నుండి బహిర్గతమైన 3.6 మిలియన్ల పత్రాలను పరిశీలించగా కాగ్నైట్‌కు ప్రపంచవ్యాప్తంగా 69 అనుబంధ సంస్థలు ఉన్నాయని, వాటిలో నాలుగు సంస్థలకు భారత్‌లో కార్యాలయాలు ఉన్నాయని తేలింది. పరిశోధనాత్మక జర్నలిస్టులతో కూడిన అంతర్జాతీయ కన్సార్టియంలో భాగంగా ఉన్న ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. వెరియంట్‌ సిఇఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, వెరియంట్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, వెరియంట్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, విట్నెస్‌ సిస్టమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఈ నాలుగు భారతీయ అనుబంధ కంపెనీలు నడుస్తున్నాయి. కాగ్నైట్‌ కంపెనీ మన దేశంలో కాగ్నైట్‌ అనలిటిక్స్‌ ఇండియా పేరిట కార్యకలాపాలు నిర్వహించింది. దక్షిణ న్యూఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లో దీని ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల కార్యాలయం ఉంది. వెరియంట్‌ సిఇఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కాగ్నైట్‌కు సంబంధమే లేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అక్కడ యాభై మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కాగ్నైట్‌కు చెందిన నాలుగు భారతీయ అనుబంధ సంస్థల బ్యాలెన్స్‌ షీట్లను పరిశీలించగా వాటికి ఇజ్రాయిల్‌, హాంకాంగ్‌లోని కాగ్నైట్‌ విదేశీ అనుబంధ కంపెనీల నుండి గణనీయంగా ఆదాయం లభించిందని తెలిసింది.

ఉదాహరణకు 2021 మార్చి 31తో అంతమైన సంవత్సరంలో వెరియంట్‌ సిఇఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తనకు రూ.128.21 కోట్ల ఆదాయం లభించిందని, రూ.8.05 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపింది. అదే సంవత్సరంలో అమెరికాలోని వెరియంట్‌ అమెరికాస్‌ కంపెనీకి, దాని హోల్డింగ్‌ కంపెనీకి అందించిన సేవలకు రూ.60.61 కోట్లు అందుకుంది. అంటే ఆ సంవత్సరంలో పొందిన మొత్తం ఆదాయంలో సగమన్న మాట. వెరియంట్‌ సిఇఎస్‌ ఇండియా ఇజ్రాయిల్‌లోని కాగ్నైట్‌ టెక్నాలజీస్‌ ఇజ్రాయిల్‌ లిమిటెడ్‌ అనే అనుబంధ సంస్థతో లావాదేవీలు జరిపింది. వెరియంట్‌ సిఇఎస్‌ ఇండియా హాంకాంగ్‌ అనుబంధ సంస్థకు సేవలు అందించినందుకు రూ.2.02 కోట్ల ఆదాయం పొందింది. అంతేకాదు… వెరియంట్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన ఖర్చుల వివరాలు సరిగా వెల్లడించనందుకు ఆదాయపు పన్ను శాఖకు జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.

➡️