తెలంగాణ గిరిజన యూనివర్శిటీ బిల్లుకు ఆమోదం

Dec 8,2023 11:02 #Telangana, #tribal university

 

మూజువాణి ఓటుతో బిల్లు ఓకే అన్ని పార్టీలు మద్దతు

వరంగల్‌ జిల్లా ములుగులో యూనివర్శిటీ

విద్యతో రాజకీయాలు చేయొద్దని కేంద్రానికి ప్రతిపక్షాలు హితవు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలంగాణలోని సమ్మక్క సారక్క సెంట్రల్‌ గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించిన సెంట్రల్‌ యూనివర్శిటీ సవరణ బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. వివిధ పార్టీల ఎంపిలు రెండు రోజుల పాటు ఈ బిల్లుపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. బిల్లుకు 40 మంది ఎంపిలు సవరణలు సూచించారు. అనంతరం బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. చర్చల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ సవరణలు సూచించిన ఎంపిలందరికీ ధన్యవాదాలు తెలిపారు. గిరిజన డ్రాపౌట్స్‌, వివక్ష వంటి ప్రతిపక్ష ఎంపిలు చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి సమాధానమిస్తూ కుటుంబ పరిమితులు చాలా మంది విద్యార్థులను విద్యను విడిచిపెట్టేలా చేశాయని అన్నారు. ”ఈ బిల్లును ఆమోదించడానికి మాకు తొమ్మిదేళ్లు పట్టింది. మీరు చాలా కాలం అధికారంలో ఉండి గిరిజనులకు చేసిందేమీ లేదు. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం లేదు” అని అన్నారు. యూనివర్శిటీ నిర్మాణానికి భూములు సేకరించడంలో కెసిఆర్‌ ప్రభుత్వమే జాప్యం చేసిందని విమర్శించారు. ఈ యూనివర్శిటీ ఏర్పాటు రాబోయే కాలంలో ప్రాంతీయ ఆకాంక్షలను తీర్చగలదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉన్నత విద్య, పరిశోధన సౌకర్యాలను సులభతరం చేస్తుందని, ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని గిరిజన జనాభాకు గిరిజన కళలు, సంస్కృతి, ఆచారాలు, సాంకేతికతలో పురోగతిలో బోధన, పరిశోధన సౌకర్యాలను అందించడంతో అధునాతన జ్ఞానాన్ని కూడా ప్రోత్సహిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వరంగల్‌ జిల్లా ములుగులో ఈ సెంట్రల్‌ ట్రైబుల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు. ఏడేళ్లలో రెండు దశల్లో రూ.889.07 కోట్లతో నిర్మించనున్నారు.విద్యతో రాజకీయాలు వద్దు : కేంద్రానికి ప్రతిపక్షాలు హితవువిద్యతో రాజకీయాలు చేయొద్దని కేంద్ర ద్రానికి ప్రతిపక్ష ఎంపిలు హితవు పలికారు. ఆర్‌ఎస్‌పి ఎంపి ఎన్‌కె ప్రేమచంద్రన్‌ మాట్లాడుతూ.. ”ప్రధాని బొమ్మతో విద్యార్థులు ఫోటోలు దిగేందుకు వీలుగా కళాశాలల్లో సెల్ఫీ పాయింట్లు ఉంచితే, దాన్ని రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సెల్ఫీ పాయింట్లు ఉంచాలని ముఖ్యమంత్రులు నోటీసులు జారీ చేస్తారు. ఇలాంటి రాజకీయాలే దేశ విశ్వవిద్యాలయాల ప్రతిష్టను దిగజార్చడానికి కారణం అవుతాయి” అని ఆయన విమర్శించారు.కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి చర్చను ముగిస్తూ ‘సెల్ఫీ-అవగాహన’ గల ప్రధానిని ‘విద్యా అవగాహన’ కలిగి ఉండాలని ఎద్దేవా చేశారు. అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు), జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ (జెఎంయు) వంటి ముస్లీం యూనివర్శిటీలకు బడ్జెట్‌ను ఎందుకు తగ్గించారని కాంగ్రెస్‌ ఎంపీ సీనియర్‌ మహ్మద్‌ జావేద్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. తన నియోజకవర్గం కిషన్‌గంజ్‌ విశ్వవిద్యాలయం తీవ్రమైన సిబ్బంది కొరత, నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. ”కొత్త విశ్వవిద్యాలయాలను మాత్రమే ఎందుకు ప్రారంభిస్తున్నారు? ఇప్పటికే ఉన్న విశ్వవిద్యాలయాలను ఎందుకు బలోపేతం చేయరు?”అని ప్రశ్నించారు. బిఎస్‌పి ఎంపి రితేష్‌ పాండే మాట్లాడుతూ అటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు తెరవకముందే దేశం అంతటా గిరిజనులకు అందించే ఏకలవ్య పాఠశాలలను బలోపేతం చేయాలని పునరుద్ఘాటించారు.గిరిజన, మైనారిటీ విద్యార్థులపై వివక్షసమాజ్‌వాదీ పార్టీ ఎంపి ఎస్‌టీ హసన్‌ మాట్లాడుతూ యూనివర్శిటీల్లో గిరిజన, మైనారిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షను ఎత్తిచూపారు. విద్యపై కేంద్రం ఎక్కువ ఖర్చు చేయాలని కోరుతూ, ఈ విశ్వవిద్యాలయాలు అందించే పాఠాలు ప్రాచీన భారతీయ విలువలను ప్రతిబింబించేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. బిజెపి ఎంపి సత్యపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోనూ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను ప్రధాన స్రవంతి ఉన్నత విద్యలోకి తీసుకురావడానికి ఇటువంటి విశ్వవిద్యాలయాలలో సిలబస్‌లో సమానత్వం తీసుకురావాలని కోరారు.

➡️