నన్ను అరెస్ట్‌ చేసేందుకు బిజెపి యత్నిస్తోంది : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ :   తనను అరెస్ట్‌ చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ గురువారం ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఈడి విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండేళ్లుగా దర్యాప్తు జరుగుతున్నా.. సార్వత్రిక ఎన్నికల ముందే సమన్లు ఎందుకు ఇవ్వాల్సివచ్చిందని నిలదీశారు. లిక్కర్‌ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని, కేవలం తనను అరెస్టు చేసేందుకు బిజెపి చేస్తున్న కుట్ర ఇదని మండిపడ్డారు.

” గత రెండేళ్లుగా లిక్కర్‌ పాలసీ స్కామ్‌ గురించి అనేక సార్లు వింటున్నాం. ఈ రెండేళ్లలో బిజెపి దర్యాప్తు సంస్థలన్నీ పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది, పలువురిని అరెస్ట్‌ చేసింది. అయితే సోదాల్లో ఎక్కడ అవినీతి సొమ్ము అంటూ ఒక్క పైసా కూడా బయటపడలేదు. ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే ఆ కోట్లాది రూపాయలన్నీ ఎక్కడికి వెళ్లాయి?. డబ్బంతా గాల్లోనే మాయమైందా” అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఎక్కడా అవినీతి జరగలేదని, జరిగి ఉంటే డబ్బుదొరికి ఉండేదని పునరుద్ఘాటించారు.

ఈడి సమన్లపై స్పందిస్తూ.. ”ఈడి  సమన్లు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయవాదులు చెప్పారని, అదే విషయాన్ని తాను ఈడి దృష్టికి  కూడా తీసుకు వెళ్లానని కానీ వారి నుండి ఎలాంటి వివరణ రాలేదని అన్నారు.  తనను అరెస్ట్‌ చేయడానికే సమన్లు జారీ చేస్తున్నారని, వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే బిజెపి లక్ష్యమని అన్నారు. నిజాయతీ తన ఆస్తి అని.. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో తన పేరును చెడగొట్టడానికి బిజెపి చూస్తోందని మండిపడ్డారు.

➡️