కేజ్రీవాల్‌కు ఆరు రోజులు ఇడి కస్టడీ

రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రతిపక్ష నాయకులను వేటాడే కార్యక్రమంలో భాగంగా గురువారం అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు (ఈనెల 28 వరకు) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కస్టడీకి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. వైద్య పరీక్షల అనంతరం కేజ్రీవాల్‌ ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన ఇడి, ఆయనను తన కస్టడీకి పంపాలని 28 పేజీల రిపోర్టును సమర్పించింది. ఇడి తరపున సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు తన వాదన వినిపిస్తూ, ఈ కేసులో కేజ్రీవాల్‌ కీలక సూత్రధారి అని, మద్యం పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గన్నారని ఆరోపణల చిట్టా చదివారు. ‘ ఇందులో సౌత్‌ గ్రూప్‌నకు అనుకూలంగా వ్యవహరించారని, ఇది రూ.వంద కోట్ల స్కామ్‌ కాదు, రూ.600 కోట్ల స్కామ్‌ అని. ఇందులో కేజ్రీవాల్‌కు రూ.300 కోట్లు అందాయని ఆ చిట్టాలో పేర్కొన్నారు. . ఈ డబ్బే పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఖర్చుపెట్టిందని, రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు పంపారని, ఆప్‌, సౌత్‌ గ్రూప్‌ల మధ్య విజరునాయర్‌ వారధిగా ఉన్నారని పకడ్బందీగా స్క్రిప్టును రూపొందించారు. విజరు నాయర్‌ కంపెనీ నుంచి అన్ని ఆధారాలూ సేకరించామని, మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి’ అని ఇది తెలిపింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ను పది రోజులు కస్టడీకి కోరింది.
ఈ కేసులోనే అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం, ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా బెయిల్‌ లభించలేదన్న విషయాన్నిన్యాయస్థానం దఅష్టికి ఈడి తీసుకెళ్లింది. ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని, రెండు పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని ఇడి తన రిపోర్టులో ఆరోపించింది. సౌత్‌ గ్రూప్‌కు లిక్కర్‌ పాలసీలో లబ్ది చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని, దీనిలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్‌ కలిశారని, కలిసి పని చేద్దామంటూ కవితతో సిఎం కేజ్రీవాల్‌ చెప్పారని ఇడి పేర్కొంది.
తన జీవితం దేశానికి అంకితం: కేజ్రీవాల్‌
తన జీవితం దేశానికి అంకితమని, లోపల ఉన్నా, బయట ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడి అరెస్ట్‌ తర్వాత ఆయన తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటానని పేర్కొన్నారు. శుక్రవారం కేజ్రీవాల్‌ను కోర్టు లో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

➡️