పి.వి-చరణ్‌సింగ్‌-స్వామినాథన్‌లకు భారతరత్న

న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి పివి.నరసింహరావు, చరణ్‌ సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌లకు భారతరత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడి ట్వీటర్‌ వేదికగా వెల్లడించారు. భారతరత్న సాధించిన తొలి తెలుగు బిడ్డగా పివి.నరసింహారావు నిలిచారు. ఇప్పటికే కర్పూరి ఠాకూర్‌, ఎల్‌.కె.అద్వానీలకు భారతరత్న ప్రకటించిన సంగతి విదితమే. ఈసారి మొత్తం ఐదుగురికి భారతరత్న అత్యున్నత పురస్కారాన్ని కేంద్రం ప్రకటించడం విశేషం.

పివి.నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పనిచేశారు. ఈ పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారత వ్యక్తి పి.వి. కావడం విశేషం. సంక్షోభంలో ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి ప్రగతి బాట పట్టించిన ఘనతను పివి సొంతం చేసుకున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు 1921జూన్‌ 28న జన్మించి 2004డిసెంబర్‌ 23న మరణించారు. న్యాయవాదిగా, బహుభాషావేత్తగా, రచయితగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఎంగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పివి దేశానికి విశేష సేవలందించారు.

➡️