చట్టం ముందు అందరూ సమానమే

Jan 10,2024 10:51 #Bilkis Bano, #Case, #Delhi, #Supreme Court
  • న్యాయ ప్రక్రియపై విశ్వాసం కల్పించే తీర్పు
  • మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి కృతజ్ఞతలు
  • సుప్రీం తీర్పు పట్ల బిల్కిస్‌ బానో స్పందన

న్యూఢిల్లీ : చట్టం ముందు అందరూ సమానమే..సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థపై ఆశను చిగురింపజేసింది..నాకు మద్దతుగా నిలిచిన వేలాది ప్రజానీకానికి కృతజ్ఞతలు..నేడు కొండంత బరువును దించుకున్నట్లుగా ఉంది..ఉపశమనంతో కన్నీళ్లు పెట్టుకున్నాను..ఇది సుప్రీం తీర్పుపై బిల్కిస్‌ బానో స్పందన. గుజరాత్‌ మారణకాండ నేపథ్యంలో ఆమె కుటుంబం కాషాయ గూండాల నుంచి తీవ్ర దాడులను ఎదుర్కొంది. నాటి కేసుల్లో శిక్ష పడిన 11 మంది సంఫ్‌ు పరివార్‌ గూండాలకు జైలు శిక్ష తగ్గించి గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. గుజరాత్‌ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసి..ఆ 11 మంది దుండగులు తిరిగి జైలుకు రావాలని జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నాడు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై బిల్కిస్‌ బానో తన మనస్సులోని మాటను దేశ ప్రజలందరితో పంచుకుంటూ ఒక ప్రకటన చేశారు. బిల్కిస్‌ తరపున ఆమె న్యాయవాది శోభా గుప్తా జారీ చేసిన ఆ ప్రకటన ఇలా ఉంది..

‘నేడు నిజంగా నాకు నూతన సంవత్సరం. ఉపశమనంతో నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఏడాదిన్నర కాలంలో మొదటిసారిగా నవ్వాను. నా పిల్లలను ఆలింగనం చేసుకున్నాను. నా ఛాతీపై నుండి పెద్ద కొండంత భారాన్ని దింపుకున్నట్లు అనిపించింది. తిరిగి ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. జరిగిన న్యాయం నాకు అలా అనిపించేలా చేసింది. ఈ నిరూపణను, అందరికీ సమాన న్యాయం అందిస్తామన్న హామీపై ఆశను నాకు, నా పిల్లలకు, మహిళలందరికీ అందించినందుకు భారత సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు.

నేను ఇంతకుముందు చెప్పాను, ఈనాడు మళ్లీ చెబుతున్నాను, నేను చేసినటువంటి ఈ ప్రయాణాలు ఎవరూ, ఎన్నడూ ఒంటరిగా చేయలేరు. నా వెనుకనే, నాకు అండగా నా భర్త, నా పిల్లలు వున్నారు. నాకు నా స్నేహితులు వున్నారు. ఇటువంటి విద్వేషం నెలకొన్న సమయంలో వారు నాకు ఎంతగానో ప్రేమను అందించారు. ప్రతి క్లిష్టమైన మలుపులో వారు నా చేయి పట్టుకున్నారు. అసాధారణమైన న్యాయవాది శోభా గుప్తా నాతో వున్నారు. 20ఏళ్ల సుదీర్ఘ కాలం ఆమె నాతోనే పయనం సాగించారు. న్యాయం అందించే ప్రక్రియ పట్ల ఆశావాదాన్ని కోల్పోవడానికి ఆమె ఎన్నడూ అనుమతించలేదు.

ఏడాదిన్నర క్రితం, 2022 ఆగస్టు 15న, నా కుటుంబాన్ని ధ్వంసం చేసిన, నా ఉనికినే భయకంపితంగా చేసిన వారిని త్వరగా విడుదల చేశారు. అది వినగానే నేను కుప్పకూలిపోయాను. నా ధైర్యమంతా ఆవిరి అయిపోయినట్లు అనిపించింది. లక్షలాదిగా సంఘీభావ సందేశాలు నాకు వచ్చాయి. వేలాదిమంది సామాన్య ప్రజానీకం, మహిళలు ముందుకొచ్చారు. వారు నాకు అండగా నిలిచారు. నాతో మాట్లాడారు. సుప్రీం కోర్టులో పిల్‌ పిటిషన్లు వేశారు. దేశవ్యాప్తంగా 6 వేలు, ముంబయికి చెందినవారే 8500 మంది రాతపూర్వక అప్పీళ్లు పంపించారు. 10 వేల మంది బహిరంగ లేఖ రాశారు. కర్ణాటకలోని 29 జిల్లాలకు చెందిన 40 వేల మంది కూడా అలాగే లేఖ రాశారు. వీరిలో ప్రతి ఒక్కరికీ, వారి అమూల్యమైన సంఘీభావం, బలాన్ని అందించినందుకు నా కృతజ్ఞతలు. కేవలం నా కోసమే కాదు, భారత్‌లోని ప్రతి ఒక్క మహిళ కోసం న్యాయం యొక్క ఆలోచనను రక్షించడానికి పోరాడాలనే సంకల్పాన్ని మీరు నాకిచ్చారు. అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

ఈ తీర్పు యొక్క పూర్తి అర్థాన్ని నా జీవితానికి, నా పిల్లల జీవితాలకు అన్వయించుకుని, అవగాహన చేసుకున్నప్పటికీ, నేడు నా హృదయం నుండి వెలువడే ప్రార్ధన అనేది చాలా సింపుల్‌గా వుంటుంది. – చట్టబద్ధ పాలన అన్నిటికీ అతీతం, చట్టం ముందు అందరూ సమానమే.’

– బిల్కిస్‌ బానో

జనవరి 8, 2024

 

➡️