అబద్ధాల పుట్ట ! : సిఐటియు విమర్శ

Feb 2,2024 10:31 #Birth, #CITU, #Critique, #lies

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అబద్ధాల పుట్ట అని, ప్రైవేటీకరణ కోసం బరి తెగించి చేసిన ప్రయత్నమని సిఐటియు విమర్శించింది. ప్రజల ఆదాయాలు 50శాతం పెరిగాయని, ద్రవ్యోల్బణం ఒక మోస్తరు స్థాయికి చేరుకుందంటూ చెప్పుకోవడం ద్వారా తిరిగి అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నంగా వుందని పేర్కొంది. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఒక ప్రకటన జారీ చేశారు. నిజానికి వాస్తవిక పరిస్థితులు భిన్నంగా వున్నాయని, నిత్యావసరాల ధరలు పెరుగుతునే వున్నాయని, నిరుద్యోగం పెచ్చరిల్లిందని విమర్శించింది. తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికే పోరాడుతున్న సామాన్యుల్లో విశ్వాసాన్ని పాదుగొల్పడంలో ఈ బడ్జెట్‌ ఘోరంగా విఫలమైందని విమర్శించింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు మోడీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారని, రూ.4.09లక్షల కోట్ల మేరకు ప్రైవేటీకరణ జరిగిందని, దేశ చరిత్రలోనే ఇది అత్యంత ఎక్కువని విమర్శించింది. ఈ సంవత్సరంలో రూ.30 వేల కోట్ల మేరకు పెట్టుబడులను ఉపసంహరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2025లో ఈ లక్ష్యం రూ.50 వేల కోట్లకు పెరిగిందని సిఐటియు పేర్కొంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రైవేటుకు ద్వారాలు తెరిచారని, రూ.లక్ష కోట్లతో కార్పస్‌ను ఏర్పాటు చేశారని విమర్శించింది. వినూత్న ఆవిష్కరణల ముసుగులో ప్రైవేటు రంగానికి 50ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అందించేందుకే ఈ చర్యలని పేర్కొంది. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్యవాదం భావనను సమూలంగా ధ్వంసం చేసేందుకు ఒకపక్క మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తుండగా, మరోవైపు రాబోయే తరం సంస్కరణలు చేపట్టడానికి అవసరమైన బ్లూ ప్రింట్‌ను రాష్ట్రాలతో చర్చించి రూపొందిస్తామని బడ్జెట్‌లో చెప్పడం హాస్యాస్పదంగా వుందని సిఐటియు విమర్శించింది. గత పదేళ్ల మోడీ సర్కార్‌ పనితీరును చూసినట్లైతే, ఇది కార్మిక, కర్షక, ప్రజా, జాతి వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టమవుతోందని తపన్‌సేన్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తంగా చూసినట్లైతే కార్మికులు, రైతాంగం, సామాన్యులకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి సానుకూల చర్యలు లేవని విమర్శించారు.సంయుక్త కిసాన్‌ మోర్చా, సిటియుల పిలుపు మేరకు ఈ నెల 16న జరగనున్న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా సిఐటియు తన అనుబంధ సంఘాలకు, సభ్యులకు పిలుపునిచ్చింది.

➡️