ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు బిజెపి కుట్ర : బృందాకరత్‌ 

Mar 23,2024 10:08 #BJP, #Brindakarat, #Conspiracy
  • యథేచ్ఛగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
  • సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు బిజెపి కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని, ఆదాయ పన్ను విభాగం (ఐటి)ని దుర్వినియోగం చేస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించారు. ‘ కేజ్రీవాల్‌ అరెస్టును చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైన చర్య. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేసేందుకే బిజెపి ఈ చర్యకు దిగింది. ప్రతిపక్షాలను వేటాడేందుకు అధికార పార్టీ చాలా స్పష్టంగా ఇడిని అస్త్రంగా ఉపయోగిస్తోంది. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, వేధించడం ద్వారా ప్రతిపక్షాల ఫోరాన్ని బలహీనపరచాలని బిజెపి కుట్ర పన్నుతుంది” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రులను అరెస్టు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ కుటుంబాన్ని కూడా ఇతరులు కలవనివ్వకుండా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమని ఆమె తెలిపారు. ఎన్నికల బాండ్లు బిజెపి తీసుకొచ్చిన అత్యంత అవినీతికర వ్యవస్థ అని బృందాకరత్‌ విమర్శించారు. ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్‌బిఐ సకాలంలో విడుదల చేయకపోవడం వెనుక బిజెపి ఒత్తిళ్లున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. బాండ్ల పూర్తి వివరాల వెల్లడికి మూడు నెలల గడువు కోరడం పాలకపక్ష సిగ్గుమాలిన తనానికి నిదర్శనమన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి బెదిరించడం లేదా కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి ద్వారా బిజెపి ఎన్నికల బాండ్లను తనకు నిధులు సమకూర్చే సాధనంగా మార్చుకొని క్విడ్‌ప్రోకు పాల్పడిందని తప్పుబట్టారు.

➡️