బిజెపిది ఆర్థిక ఉగ్రవాదం

Feb 23,2024 11:13 #congress leader

కాంగ్రెస్‌ను ఆర్థికంగా కూల్చేందుకు కుట్ర

మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. గురువారం నాడిక్కడ ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు కెసి వేణుగోపాల్‌, అజరు మాకెన్‌, జైరాం రమేష్‌ మాట్లాడారు. తమపై ట్యాక్స్‌ టెర్రరిజం దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కూల్చేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన అకౌంట్ల నుంచి ఆ సర్కారు రూ.65 కోట్లు లూటీ చేసినట్లు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, నియంతృత్వ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. భారత్‌ జోడో యాత్ర, రైతు ఉద్యమం, ద్రవ్యోల్బణం వల్ల బిజెపి ఒత్తిడికి లోనైనట్లు ఆయన పేర్కొన్నారు.

➡️