బిజెపికి బుద్ధి చెప్పాలి

  • జైళ్లలో పెడితే బెదిరిపోం శ్రీ యువత ఆలోచించి ఓటేయాలి
  • రాంచీ ర్యాలీలో ఇండియా బ్లాక్‌ నేతల పిలుపు శ్రీ ఏచూరి సంఘీభావం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న బిజెపికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని ఇండియా బ్లాక్‌ నేతలు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించుకో వాలంటే ‘ఇండియా’ బ్లాక్‌ను గెలిపించు కోవాలన్నారు. మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగే ఈ పోరాటంలో విజయం సాధించి తీరుతామన్నారు. మోడీ పదేళ్ల పాలన అన్ని తరగతుల ప్రజానీనీకాన్ని తీవ్ర కడగండ్ల పాల్జేసిందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ సిఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ప్రభాత్‌ తారా గ్రౌండ్‌ వేదికగా ‘ఇండియా’ బ్లాక్‌ ఉల్గులాన్‌ న్యారు ర్యాలీ నిర్వహించింది. సభా వేదికపై అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కుర్చీలను ఖాళీగా ఉంచారు. ఇందులో పాల్గొన్న జెఎంఎం కార్యకర్తలు సోరెన్‌ మాస్క్‌లు ధరించి వచ్చారు. ”జైలు కా తాలా తూటేగా, హేమంత్‌ సోరెన్‌ చుటేగా” (జైలు తాళం పగలగొడతాం. హేమంత్‌ సోరెన్‌ను విడుదల చేస్తారు), ”జార్ఖండ్‌ జుకేగా నహీ” (జార్ఖండ్‌ తలవంచదు)” వంటి నినాదాలు హోరెత్తాయి. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్‌), తేజస్వి యాదవ్‌ (ఆర్జేడి), అఖిలేష్‌ యాదవ్‌ (సమాజ్‌వారి పార్టీ), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాంగ్రెస్‌), భగవంత్‌ సింగ్‌ మాన్‌ (పంజాబ్‌ ముఖ్యమంత్రి), చంపై సోరెన్‌ (జార్ఖండ్‌ సిఎం) వంటి అగ్ర నేతలతోబాటు జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి భార్య కల్పనా సోరెన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రావాల్‌ కూడా పోల్గొన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి రావడంతో ఈ ర్యాలీకి హాజరుకాలేకపోతున్నానని, అయితే, ఈ ర్యాలీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన సోరెన్‌ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దాన్ని ఆమె సభలో చదివి వినిపించారు.
బిజెపి తుడిచిపెట్టుకుపోతుంది: ఖర్గే
వచ్చే ఎన్నికల్లో బిజెపి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. ”మేము ప్రజలకు భయపడతాం తప్ప, మోడీ లాంటి నాయకులకు కాదు. ఇద్దరు ముఖ్యమంత్రులను జైలులో పెట్టారు. దీనికి మేం భయపడం. ఇండియా బ్లాక్‌తో తెగతెంపులు చేసుకోవాలని జార్ఖండ్‌ ముఖ్యమంత్రిపై బిజెపి ఒత్తిడి తెచ్చింది.. అందుకు ఆయన నిరాకరించడంతో జైలులో పెట్టించింది. వారు మమ్మల్ని ఇసుకలో పాతిపెట్టినా, పైకి లేస్తాం.. గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్న బిజెపికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు
నియంతృత్వ పాలనకు చరమగీతం:

జార్ఖండ్‌ సిఎం చంపై సోరెన్‌
జార్ఖండ్‌ సిఎం చంపై సోరెన్‌ మాట్లాడుతూ నియంత పాలనకు చరమగీతం పాడాలన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఇండియా బ్లాక్‌ను గెలిపించాలన్నారు. జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమే హేమంత్‌ సోరెన్‌ అరెస్టు అని ఆయన అన్నారు.

ఇండియా బ్లాక్‌ కు ఓటు దేశానికి రక్ష: ఫరూక్‌ అబ్దుల్లా
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ ”ప్రతి రాష్ట్రానికి దాని స్వంత భాష ఉంటుంది. మనమందరం కలిసినప్పుడే భారతదేశం అవుతుంది. ఈ దేశ సౌందర్యం వివిధ రంగులతో కూడుకుని ఉంది. భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారత దేశ సంస్కృతికి ప్రతీకగా ఉన్న రాజ్యాంగాన్నే నాశనం చేయాలని బిజెపి చూస్తోందని, ఆ ఆటలు సాగనివ్వరాదని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు: తేజస్వి
బీహార్‌ మాజీ డిప్యూటీ సిఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ ”బిజెపి నేతలు, మంత్రులు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.. ఇది బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం, దాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. బీహార్‌లో కూడా రాజ్యాంగాన్ని మార్చుతామని వారి మంత్రులు, అభ్యర్థులు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పే మిమ్మల్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారని ఆయన అన్నారు.

బిర్సా ముండా స్పూర్తితో బిజెపికి బుద్ధి చెబుదాం: అఖిలేష్‌ యాదవ్‌
యుపి మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ . ”ఇది లార్డ్‌ బిర్సా ముండా పుట్టిన నేల. ఇక్కడి ప్రజలు అన్యాయానికి ఎన్నడూ తలవంచరు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఈ గడ్డ పోరాట చరిత్రను గుర్తుకు తెచ్చుకోండి. మీకు అన్యాయం చేసినవారికి తగిన బుద్ధి చెప్పంది ఈసారి ఓటు వేయడానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఓటు వేయండి” అని పిలుపు ఇచ్చారు. ఎలక్టోరల్‌ బాండ్ల స్కీములో బిజెపి బండారం బయటపడిందని అన్నారు. 2014లో వచ్చిన వారు 2024లో వెళ్లిపోతారని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. మన దేశాన్ని పదేళ్లలో వెనక్కి నెట్టడానికి కృషి చేసిన వారికి వీడ్కోలు కూడా అదే స్థాయిలో ఉండాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సారి 400 దాటుతుందనే నినాదాన్ని బిజెపి నిరంతరంగా ఇస్తోందని, కానీ వీరు నైతికంగా ఓడిపోయారని, ఢిల్లీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ఇద్దరినీ జైలుకు పంపడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

ఆకాశాన్నంటుతున్న ధరలు: ప్రియాంక చతుర్వేది
శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ మోడీ పాలనలో ధరలు ఆకాశాన్నంటాయని , నిరుద్యోగం విలయ తాండవం చేస్తోందని విమర్శించారు. మహిళలకు భద్రత లేదన్నారు. దేశంలో చాలా మంది ఓటర్లు.. తొలి దశ పోలింగ్‌కు దూరంగా ఉన్నారని, ఇది సరికాదని అన్నారు. . యువ ఓటర్లు బయటకు వచ్చి ఓట్లు వేస్తేనే.. కేంద్రంలోని అధికారాన్ని మార్చగలమన్నారు.

నేరం రుజువుకాకుండానే వారిని జైల్లో పెట్టారు: సునీతా కేజ్రీవాల్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌, జార్కండ్‌ మాజీ సిఎం హేమంత్‌ సొరెన్‌లపై ఆరోపణలు రుజువుకాకుండానే వారిని జైల్లో పెట్టడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వాన్ని తెలియజేస్తోందనికేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ విమర్శించారు. అందరికీ మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు సమకూర్చడమే ఆయన చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్‌ తన జీవితాన్ని పణంగా పెట్టారని, ఐఐటి గ్రాడ్యుయేట్‌ అయిన కేజ్రీవాల్‌ తలుచుకుంటే విదేశాలకు వెళ్లేవారని, కానీ ఆయన దేశభక్తికే మొగ్గుచూపారని చెప్పారు. తన భర్తను తీహార్‌ జైలులో అంతమొందించేందుకు బిజెపి కుట్ర పన్నిందని విమర్శించారు. ఆయన తీసుకునే భోజనంపై కెమెరాలతో నిఘా పెడుతున్నారని ఆమె ఆరోపించారు. మధమేహానికి 12 ఏళ్లుగా రోజూ ఇన్సులిన్‌ తీసుకుంటున్న కేజ్రీవాల్‌కు జైలులో ఇన్సులిన్‌ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారని ఆమె అన్నారు.

➡️