పోలింగ్‌ కేంద్రంలో బిజెపి నేత కుమారుడి జులుం

May 9,2024 23:42 #Election Commission, #orders

పైగా సోషల్‌ మీడియాలో లైవ్‌స్ట్రీమింగ్‌
గుజరాత్‌లోని దాహోద్‌లో రీపోలింగ్‌కు ఇసి ఆదేశం
గాంధీనగర్‌ : ఈ నెల 7న జరిగిన మూడోదశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గుజరాత్‌లో ఒక బిజెపి నాయకుడు కుమారుడు ఏకంగా పోలింగ్‌ కేంద్రంలోనే జులుంకు పాల్పడ్డాడు. పోలింగ్‌ కేంద్రంలోని అధికారులను దుర్భాషలాడుతూ కేంద్రాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తన అనుచరులతో కలిసి బోగస్‌ ఓటింగ్‌కు పాల్గన్నాడు. పైగా ఈ దారుణాన్ని సోషల్‌ మీడియాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా చేశాడు. అలాగే అక్కడ ఉన్న ఇవిఎం, ఇతర ఎన్నికల పరికరాలన్నీ కూడా తన తండ్రికి చెందినవే అని చెప్పడం కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దాహోద్‌లోని పోలింగ్‌ కేంద్రం 220లో ఈ ఘటన జరిగింది. ప్రముఖ బిజెపి నాయకుడి కుమారుడు, పార్టీ సభ్యుడు విజరు భాభోర్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సంత్రంపూర్‌ అసెంబ్లీ నియోజవర్గంలోని దాహోద్‌లో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తం విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో ఈ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. దాహోద్‌లోని పోలింగ్‌ కేంద్రం 220లో ఈ నెల 7 జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఆ పోలింగ్‌ చెల్లదని, ఈ నెల 11న రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ అధికారులు గురువారం ప్రకటించారు. అలాగే, సంత్రంపూర్‌ మమ్లత్దార్‌ ఐపి పఠాన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో విజరు భాభోర్‌, మగన్‌ దామోర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపిసి సెక్షన్‌ 128, 121, 122, 131/బి, 171/డి, 135 కింద అభియోగాలు మోపారు. విజరు భభోర్‌, మనోజ్‌ మాగన్‌లను ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఐపిసి సెక్షన్ల కింద అరెస్ట్‌ చేశామని పోలీస్‌ సూపరింటెండెంట్‌ జేదీప్‌సింగ్‌ జడేజా తెలిపారు. భభోర్‌ తండ్రి రమేష్‌ భభోర్‌ గతంలో సంత్రామ్‌పూర్‌ తాలూకా అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఈ వీడియోలో బిజెపి మాత్రమే గెలవాలని, పార్టీ ఎన్నికల చిహ్నమైన కమలం గుర్తుపై బటన్‌ నొక్కాలని అతను అక్కడికి వచ్చిన ఓటర్లకు చెప్పాడు. ఇవిఎంను చేతిలో పట్టుకొని నాట్యం చేస్తున్న దృశ్యం కూడా వీడియోలో ఉంది. ఈ ఘటన నేపథ్యంలో నలుగురు పోలింగ్‌ అధికారులకు ఇసి నోటీసులు జారీ చేసింది.

➡️