‘నిజ్జార్‌’ కేసులో అరెస్టులపై సమాచారం లేదు : కేంద్రం

న్యూఢిల్లీ : ఖలిస్తానీ అనుకూల నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసినట్లు కెనడా నుంచి ఏ విధమైన అధికారిక సమచారం లేదని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం స్పష్టం చేసింది. కేవలం ఈ కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టు గురించి మాత్రమే కెనడా తెలిపిందని, తదుపరి సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. ఈ వివరాలను విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే ఈ కేసులో కెనడా అధికారులు భారత అధికారులతో నిర్దిష్ట సమాచారాన్ని లేదా ఆధారాలను పంచుకోలేదని కూడా జైస్వాల్‌ తెలిపారు. ‘కెనడా ప్రభుత్వ చర్యలో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ దేశంలో వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వారికి రాజకీయ మద్దతు లభిస్తుందని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. అక్కడ భారత దౌత్యవేత్తలను బెదిరించారు. విధులు నిర్వహించకుండా నిరోధించారు. మా అప్పగింత అభ్యర్థనలు అనేకం కెనడా వద్ద పెండింగ్‌లో ఉన్నాయి’ అని జైస్వాల్‌ తెలిపారు.
కాగా, గత ఏడాది జరిగిన నిజ్జర్‌ హత్య కేసులో ఎడ్మాంటన్‌లో నివసిస్తున్న కరణ్‌ బ్రార్‌, కమల్‌ ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ప్రతీసింగ్‌లను అరెస్టు చేసి, బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే ప్రావిన్షియల్‌ కోర్టు ముందు హాజరుపర్చినట్లు కెనడా మీడియా కథనాలు తెలిపాయి.

➡️