మైనర్లయిన అత్యాచార బాధితులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించండి : కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

బెంగళూరు : అత్యాచారం, లైంగిక నేరాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే తప్పనిసరిగా చేయాల్సిన వైద్య పరీక్షలతోపాటు పోక్సో చట్టం కింద ప్రతి ఒక్క అత్యాచార, లైంగిక నేరాల బాధితులకు గర్భధారణ పరీక్ష నిర్వహించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఈ చర్య వల్ల ఇతర సంబంధిత వైద్య పరిస్థితులు తెలియడంతోపాటు ఒకవేళ గర్భం వచ్చిన పక్షంలో గర్భధారణ సమయాన్ని సాధ్యమైనంత త్వరగా నిర్ధారించడానికి వీలవుతుందని పేర్కొంది. పైగా బాధితురాలి శారీరక, మానసిక స్థితిగతులను అంచనా వేసి, గర్భాన్ని వైద్యపరంగా తొలగించడానికి ఆమె అనువుగా వుందా లేదా అనేది కూడా తేలుతుందని పేర్కొంది. ఇందుకోసం సవివరమైన రీతిలో ప్రామాణిక పద్దతి (ఎస్‌ఓపి)ని రూపొందించాల్సిందిగా డిజిపి, ఐజి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శులను కోర్టు ఆదేశించింది. ఇందుకు అవసరమైన నిపుణులను సంప్రదించాలని పేర్కొంది. బెంగళూరు అర్బన్‌ జిల్లాకి చెందిన 17ఏళ్ల అత్యాచార బాధితురాలి 24వారాల రెండు రోజుల గర్భాన్ని తొలగించేందుకు అనుమతిస్తూ జస్టిస్‌ సూరజ్‌ గోవిందరాజ్‌ పై ఆదేశాలు జారీ చేశారు. 24 వారాలు దాటినందున గర్భస్రావానికి న్యాయస్థానాల అనుమతి అవసరం కావడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.

➡️