IT notices : కాంగ్రెస్‌కు మళ్లీ ఐటి నోటీసులు

Apr 1,2024 10:21 #Congress, #Income Tax notices

 తాజాగా రూ.1745 కోట్ల పన్నులు చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ    :   ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఆదాయపన్ను శాఖ మళ్లీ నోటీసులు పంపించింది. తాజాగా మరో రూ.1745కోట్లు ఆదాయపన్ను చెల్లించాలని ఐటి విభాగం నోటీసులు జారీ చేసింది. 2014-15 నుండి 2016-17 సంవత్సరాలకు మొత్తంగా రూ.1745 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీంతో కాంగ్రెస్‌ ఐటి పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ.3567కోట్లుకు చేరింది. తాజా మొత్తంలో 2014-15 సంవత్సరానికి (రూ.663కోట్లు), 2015-16 సంవత్సరానికి (దాదాపు రూ. 664కోట్లు), 2016-17 సంవత్సరానికి (దాదాపు రూ.417కోట్లు) చెల్లించాలని ఐటి అధికారులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఇప్పటివరకు అందుబాటులో వున్న పన్ను మినహాయింపును అధికారులు నిలిపివేశారు. దాంతో మొత్తంగా పన్నును వసూలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

దాడుల సందర్భంగా దర్యాప్తు సంస్థలు కొందరు నేతల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న డైరీల్లో పేర్కొన్న థర్డ్‌ పార్టీ ఎంట్రీలకు కూడా కాంగ్రెస్‌పై పన్ను విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018-19 రిటర్న్స్‌పై కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాలను ఐటి విభాగం స్తంభింపచేసింది. పన్నులు చెల్లించాలంటూ ఐటి అధికారులు ఇప్పటికే రూ.135 కోట్లను పార్టీ ఖాతాల నుండి విత్‌డ్రా చేశారు. దానిపై కాంగ్రెస్‌ కోర్టును ఆశ్రయించింది. దానిపై సోమవారం సుప్రీంలో విచారణ జరిగే అవకాశం వుంది. బిజెపి ఒత్తిడితోనే ఐటి శాఖ ఇండియా వేదికలోని పార్టీలపై దాడులకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

➡️