Congress: రైతులకు కనీస మద్దతు ధర.. ఎపికి ప్రత్యేక హోదా

  • 30 లక్షల ఉద్యోగాల కల్పన
  • పేదలకు ఏడాదికి రూ. లక్ష
  • రూ.450కే గ్యాస్‌ సిలిండర్‌
  • ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ
  • సిఎఎ, యుసిసిపై మౌనం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల విశ్వాసం చూరగొనడం కోసం కాంగ్రెస్‌ పార్టీ హామీల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని, ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హౌదాను పునరుద్ధరిస్తామని, అగ్నిపథ్‌ ప్రాజెక్టు రద్దు చేస్తామని, రైతులకు కనీస మద్దతు దర కల్పిస్తామని, యువతకు అప్రెంటిస్‌షిప్‌ కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, 450 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, ఎస్సీ ఎస్టీ, ఒబిసిల రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని ఎత్తివేస్తామని, మిడ్డే మీల్‌, అంగన్‌వాడీల వేతనాలను పెంచుతామని కాంగ్రెస్‌ 46 పేజీల తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అయితే, పౌరసత్వ సవరణ చట్టం, యూనిఫాం సివిల్‌ కోడ్‌ వంటి వాటిపై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయలేకపోయింది. ఈ మ్యానిఫెస్టోకు పాంచ్‌ న్యారు పత్రం అని పేరు పెట్టింది, ఇందులో అయిదు న్యాయాలు, 25 హామీలు పొందుపరచింది. పాంచ్‌ న్యారులో యువ న్యారు, నారీ న్యారు, కిసాన్‌ న్యారు, శ్రామిక్‌ న్యారు, హిస్సేదారి (సామాజిక) న్యారు ఉన్నాయి. ముస్లిం వ్యతిరేక ఓట్లను లక్ష్యంగా చేసుకుని బిజెపి హిందుత్వ ఎజెండాను ఆశయించగా, బిజెపిని సవాల్‌ చేసి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కాంగ్రెస్‌ పాంచ్‌ న్యారును ముందుకు తెచ్చింది. ఈ మ్యానిఫెస్టోను ఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ పి చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ తదితరులు ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ఈ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కనీస వేతనం రూ.400కి పెంచుతామని చెప్పింది.. ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్‌ మోడల్‌ నగదు రహిత బీమా. పరిమితి రూ.25 లక్షలకు పెంచుతామని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే ఎంఎస్‌పికి చట్టబద్ధమైన హామీ ఇస్తామని, మైనారిటీలు, పౌరులందరిలాగే దుస్తులు, ఆహారం, భాష, ఎంచుకునే స్వ్ణేచ్ఛ కలిగివుంటారని, పర్సనల్‌ లాలో సంస్కరణలకు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చింది. జాతీయ స్థాయిలో కుల గణన నిర్వహిస్తామని, పబ్లిక్‌ స్కూళ్లలో ఒకటో తరగతి నుండి 12 వ తరగతి వరకు ఉచిత విద్యనందిస్తామని, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఒబిసిలకు అదనపు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. స్వలింగ సంపర్కుల జంటలు కలిసి జీవించడానికి అనుమతించే చట్టాన్ని సంప్రదింపుల తర్వాత తీసుకొస్తామని, సీనియర్‌ సిటిజన్లు, వితంతువులు వంటి అనేక వర్గాలకు పెన్షన్‌ మొత్తంలో కేంద్ర వాటా పెంచేలా చూస్తామని మానిఫెస్టో హామీ ఇచ్చింది. మహిళా క్రీడాకారుల పట్ల వివక్ష, లైంగిక వేధింపులు, వంటి వాటికి తావులేకుండా చూస్తామని, 21 ఏళ్లలోపు వర్ధమాన క్రీడాకారులకు నెలవారీ రూ.10,000 స్కాలర్‌షిప్‌ ఇస్తామని, పేద కుటుంబాలకు ఏటా రూ.లక్ష అందించేలా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చింది. పారదర్శకత కోసం ఇవిఎం, ఎన్నికల నియమావళిలో సవరణలు తీసుకొస్తామని చెప్పింది. ఆహారం, దుస్తులు, ప్రేమ, వివాహం, ప్రయాణం, దేశంలో ఎక్కడైనా నివసించడం వంటి వ్యక్తిగత ఎంపికలకు ఆటంకం ఉండదని హామీ ఇచ్చింది.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అన్ని చట్టాలు రద్దు చేయబడతాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు సవరణలు కూడా వాగ్దానాలలో ఉన్నాయి. తప్పుడు వార్తల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.

చేయగలిగిందే చెబుతున్నాం: ఖర్గే
చేయగల్గినవే చెబుతున్నామని మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న వాటిలో కొన్ని హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అమలు చేసి చూపించామన్నారు. ఈ మ్యానిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నామని చెప్పారు.

➡️