కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింప చేసిన ఐటి శాఖ

న్యూఢిల్లీ :    సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింప చేసిందని కాంగ్రెస్‌ శుక్రవారం తెలిపింది. వాటిలో యూత్‌ కాంగ్రెస్‌ ఖాతాలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే దెబ్బ అని పార్టీ ట్రెజరర్‌ అజరు మాకెన్‌ మండిపడ్డారు. రూ. 210 కోట్ల పన్ను చెల్లింపులపై ఆదాయపు పన్ను శాఖ ఈ చర్య తీసుకుందని అన్నారు. ఈ చర్య రాజకీయ ప్రేరేపితమని, పార్టీ ఎన్నికల సన్నాహాలను అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా సమయం ప్రకారం ఖాతాలను నిలిపివేసిందని అన్నారు.

ప్రజాస్వామ్యం ఉనికిలో లేదని, నియంతృత్వం పాలన నడుస్తోందని, ప్రధాన ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజల నుండి న్యాయం కోరుతున్నామని అన్నారు.  2018-19 ఎన్నికల సంవత్సరంలో పార్టీ ఖాతాలను 45 రోజుల ఆలస్యంగా సమర్పించిందని, అయితే ఖాతాలను స్తంభింపచేయడం తీవ్రమైన చర్య అని మాకెన్‌ ధ్వజమెత్తారు. ప్రస్తుతం కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు చెల్లించేందుకు కూడా నగదు లేదని, జోడో న్యాయ యాత్రపై కూడా ప్రభావం పడిందని అన్నారు. ఐటి శాఖ చర్యల వెనుక ఉన్న ఉద్దేశాలపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.

ఖాతాలను స్తంభింపచేయడంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అధికార మత్తులో, మోడీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను స్తంభింపచేసిందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దెబ్బ అని అన్నారు. బిజెపి వసూలు చేసిన రాజ్యాంగ విరుద్ధమైన (ఎన్నికల బాండ్ల) ఎన్నికల్లో వినియోగిస్తారని, క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా తాము సేకరించిన నగదును నిలిపివేస్తారా అని ప్రశ్నించారు. అందుకే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని చెప్పాం. ఈ దేశంలో బహుళ పార్టీ వ్యవస్థను కాపాడాలని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తిచేస్తున్నామని అన్నారు. ఇది అన్యాయం, నియంతృత్వానికి వ్యతిరేకంగా గట్టి పోరాటం చేపడతామని అన్నారు.

➡️