విజయమే లక్ష్యంగా.. రాజస్థాన్‌లో సిపిఎం ప్రచారం

cpm election campaign i rajasthan

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో బుధవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బృంద కరత్‌, సుభాషిణి అలీ, కేంద్ర కమిటీ సభ్యులు విజూ కృష్ణన్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. దాతరామ్‌ఘడ్‌ అసెంబ్లీ అభ్యర్థి అమ్రారామ్‌కు మద్దతుగా డాటాలో నిర్వహించిన భారీ విజయ సంకల్ప సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం అమృత్‌కల్‌ గురించి మాట్లాడుతోందని, అయితే అమృతం పోయిందని అన్నారు. దేశంలోని రైతులు, కూలీలు, విద్యార్థి, యువకులు, దళితులు, మైనారిటీలు, మహిళల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. అమ్రారామ్‌ అసెంబ్లీకి వెళితే దాతరామ్‌ఘడ్‌లోని సామాన్య ప్రజానీకానికి నిజమైన అమృతాన్ని అందిస్తారని అన్నారు. అదే కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచిన తర్వాత దాతరామ్‌ఘడ్‌ గ్రామాల్లో తాగునీరు లేదని, ప్రభుత్వ కళాశాల లేదని అన్నారు. ఆ విధంగా కాంగ్రెస్‌, బీజేపీలు దేశ ఆస్తులను దోచుకుంటున్నాయని, మన రైల్వేలు, బ్యాంకులు, బీమా, విమానయాన సంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రులు దోచుకుంటున్నారని విమర్శిం చారు. మీ ప్రతినిధిగా అమ్రారామ్‌ ఉ ఎన్నుకోవాలని పిలుపు ఇచ్చారు. నేడు దేశం చాలా సంక్షోభంలో ఉందన్నారు. ఆ రకంగా చూస్తే రాజస్థాన్‌లో జరిగే ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ ఎన్నికల్లో రాజస్థాన్‌ ప్రజలు సీపీఎం అభ్యర్థులను గెలుపిస్తారని తాను నమ్ముతున్నానని అన్నారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రముఖ రైతు నాయకుడు, సీపీఎం అభ్యర్థి అమ్రారామ్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఎనిమిది సార్లు కాంగ్రెస్‌, ఐదుసార్లు బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని, అయితే ప్రజలు తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ కూడా ఇదే ప్రాంతంలో పుట్టాడని, కానీ బిజెపి నీళ్లను అందించలేకపోయిందని విమర్శించారు. 2008లో తనకు అవకాశం ఇచ్చారని, కోట్లాది రూపాయల ప్రణాళికను ఆమోదించి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. నేడు దంతా, పల్సానా పెద్ద పట్టణాలని, కానీ కాలేజ్‌ లేకపోవడంతో రైతు కూలీల పిల్లలు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కుండ నీళ్ల కోసం వెళ్లిన మూడో తరగతి దళిత విద్యార్థినీ ఇంద్ర మేఘ్వాల్‌ ను మీసాలు మెలిసి చంపేశారని, అందుకే సామాన్య ప్రజానీకం, దళితులు గౌరవం కల్పించేందుకు మీ ప్రతినిధిగా అమ్రారామ్‌ ను ఎన్నుకోవాలని ధోడ్‌ మాజీ ఎమ్మెల్యే పేమారామ్‌ కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కిషన్‌ పారిక్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేపర్‌ లీక్‌ ప్రభుత్వమన్నారు. ఈ సభలో సీపీఎం హర్యానా రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మాలిక్‌, మాజీ కార్యదర్శి ఇంద్రజిత్‌ సింగ్‌, ఐద్వా నేత ఆశా శర్మ, నేతలు సుభాష్‌ జాఖర్‌, భగవాన్‌ సహారు ధాకా, కుందన్‌ వర్మ, ఘాసిరామ్‌ చౌదరి, తారా ధయాల్‌, సాబీర్‌ అలీ తదితరులు ప్రసంగించారు.అంతకుముందు సికార్‌ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఉస్మాన్‌ ఖాన్‌కు మద్దతుగా జరిగిన భారీ సభను ఉద్దేశించి ఏచూరి ప్రసంగించారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి కిషన్‌ పారిక్‌ తదితరులు పాల్గొన్నారు. రైసింగ్‌నగర్‌ నియోజకవర్గంలోని ముక్లావలో సీపీఎం అభ్యర్థి సయోపాత్రంకు మద్దతుగా జరిగిన సభలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృంద కరత్‌ మాట్లాడారు. సయోపాత్రంకు అపారమైన మద్దతు లభిస్తోంది. అలాగే హనుమాన్‌ఘర్‌ నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి కామ్రేడ్‌ మంగేజ్‌ చౌదరికి మద్దతుగా నోహర్‌ లో ప్రజా విప్లవ ర్యాలీ జరిగింది. బృంద కరత్‌ మాట్లాడుతూ, సామాన్యుల బలాన్ని మరింత బలోపేతం చేయడానికి, సామాన్య ప్రజల కోసం పోరాడటానికి మంగేజ్‌ను అసెంబ్లీకి పంపాలని కోరారు. అప్పుడే మరింత గట్టిగా పోరాడవచ్చని అన్నారు. లద్నూన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలి రోడ్డులో జరిగిన సభలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు విజూ కృష్ణన్‌ మాట్లాడారు..

➡️