అధికార దుర్వినియోగం

Jan 20,2024 11:01 #cpm politburo
  •  22న ఒక పూట సెలవుపై సిపిఎం పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 22న ఒక పూట సెలవును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని సిపిఎం విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. 22 వ తేదీ మధ్యాహ్నం 2.30గంటల వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, పారిశ్రామిక సంస్థలు మూతబడతాయని ప్రకటిస్తూ ప్రభుత్వం ఆఫీస్‌ మెమోరాండం జారీ చేసిందని, బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన చర్యలు తీసుకున్నట్లు వార్తలొచ్చాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పూర్తిగా మతపరంగా జరగాల్సిన వ్యవహారంలో ప్రభుత్వం, రాజ్యం నేరుగా జోక్యం చేసుకునే దిశగా వేసిన పడిన మరో అడుగుగా పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఉద్యోగులు తమ మత విశ్వాసాలు, వ్యవహార శైలికి సంబంధించి వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే హక్కు కలిగివుంటారు, కానీ ఇటువంటి సర్క్యులర్‌ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం తన అధికారాలను తీవ్రంగా దుర్వినియోగ పరచిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. రాజ్యం ఎలాంటి మత రంగును కలిగి ఉండరాదని పేర్కొంటున్న రాజ్యాంగానికి, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలున్నాయని పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది.

➡️