దీవుల దారెటు?

Apr 17,2024 03:05 #2024 elections, #Lakshadweep
  • బిజెపి నిరంకుశ, కార్పొరేట్‌ విధానాలపై చర్చ

న్యూఢిల్లీ : లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో బిజెపి నియంతృత్వ, కార్పొరేట్‌ విధానాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అరేబియా సముద్రంలోని ద్వీపాల సముదాయంలోని చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌. షెడ్యూల్‌ తెగలకు (ఎస్టీ)లకు రిజర్వు చేయబడిన లక్షద్వీప్‌లో 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మొహ్మద్‌ హమ్దుల్లా సయ్యిద్‌, నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మొహ్మద్‌ ఫైజల్‌ మధ్య పోటీ జరిగింది. 2019 ఎన్నికల్లో ఫైజల్‌ 823 ఓట్ల స్పల్ప తేడాతో గెలిచారు.
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సిపిలోని రెండు గ్రూపుల మధ్య పోరు నెలకొంది. శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి తరపున అతిపెద్ద దీవి అయిన ఆండ్రోత్‌కు చెందిన ఫైజల్‌, అజిత్‌పవార్‌ నాయకత్వంలోని ఎన్‌సిపి నుంచి కడ్మాట్‌ దీవికి చెందిన యూసఫ్‌, కాంగ్రెస్‌ నుంచి సయ్యిద్‌ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఎంపి ఫైజల్‌పై హత్యాయత్నం కేసులో అనర్హత వేటు పడగా, ఆయన ఆ తరువాత కేంద్రంతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి.


లక్షద్వీప్‌ సర్వాధికారాలను అడ్మినిస్ట్రేటర్‌కు కట్టబెడుతూ 2020లో బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అడ్మినిస్ట్రేటర్‌గా ప్రఫుల్‌ పటేల్‌ను నియమించినప్పటి నుంచి లక్షద్వీప్‌లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోంది. యాజమాన్య హక్కుల రెన్యువల్‌, డైరీ ఫామ్‌లను మూసేయడం, మధ్యాహ్న భోజన పథకం నుంచి మాంసాహారాన్ని నిషేధించడం వంటి ప్రఫుల్‌ నియంతృత్వ పోకడలపై ఆందోళనలు వెల్లువెత్తాయి. కార్పొరేటీకరణే ధ్యేయంగా ప్రఫుల్‌పటేల్‌ చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు విమర్శించారు.
సరైన విద్య, వైద్యం, రవాణా, కమ్యూనికేషన్‌ సౌకర్యాల లేమి, పెట్రోల్‌ కొరత వంటి బిజెపి వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ గెలుపై ధీమా వ్యక్తం చేస్తుంది. నియోజకవర్గంలో 29,278 మంది పురుషులు, 28,506 మంది మహిళలు 57,784 మంది ఓటర్లు ఉన్నారు.


అండమాన్‌లోనూ అటవీ భూములపై కేంద్రం కన్ను
బంగాళాఖాతం సముద్రంలోని ద్వీపాల సముదాయం అండమాన్‌ నికోబార్‌లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. కాంగ్రెస్‌, బిజెపిలే ఇక్కడ పెద్ద పార్టీలు. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపి కుల్దీప్‌ రారు శర్మ, బిజెపి నుంచి భిష్ణుపడా రారు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 65శాతం ఓట్లతో కాంగ్రెస్‌ గెలుపొందింది. మొత్తం 12 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి బరిలో ఉండగా తొలిసారి తమిళనాడు ఎఐఎడిఎంకె అభ్యర్థి సెల్వరాజ్‌ పోటీ చేస్తున్నారు. మొత్తం 95,308 ఓట్లు ఉన్నాయి. గ్రేట్‌ నికోబార్‌ ఐలాండ్‌ ప్రాజెక్ట్‌ పేరుతో అటవీ భూములను కార్పొరేటీకరించేందుకు బిజెపి సిద్ధమయ్యింది. దీన్ని షోంపెన్‌ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. అండమాన్‌లో విద్యుత్‌ సరఫరా, రోడ్లు, తాగునీరు వంటివి ప్రధాన సమస్యలు. బిజెపి విధానాలపై ఈ ప్రాంతంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

➡️