మోడీ, దీదీ పాలనలో మసకబారిన ‘డార్జిలింగ్‌’ టీ

Apr 21,2024 03:57 #Business, #Mamata Banerjee, #modi, #tea
  • తేయాకు కార్మికుల వ్యధ వర్ణనాతీతం
  • తప్పుదారి పట్టించేందుకు ఉత్తర బెంగాల్‌లో బిజెపి, టిఎంసి మతతత్వం
  •  ప్రజల ఎజెండాతో సిపిఎం, లెఫ్ట్‌ ప్రచారం

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : ఉత్తర బెంగాల్‌లో తొలి రెండు దశల పోలింగ్‌లో తేయాకు తోటల క్షీణత, కార్మిక కుటుంబాల దుస్థితిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, తృణమూల్‌ ప్రభుత్వ వైఖరి లక్షలాది కుటుంబాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. అలీపుర్దార్‌, జల్పాయిగుడి, కూచ్‌ బిహార్‌, డార్జిలింగ్‌ లోక్‌సభ నియోజకవర్గాలలో జనాభాలో సగానికి పైగా ప్రజలు తేయాకు తోటల రంగంపై ఆధారపడి ఉన్నారు. తేయాకు తోటలపై సరళీకరణ విధానాల ప్రభావం గత పదేళ్లలో అపారంగా పెరిగింది. కార్మిక కుటుంబాల దుస్థితి ఎన్నికల్లో ప్రతిబింబించకుండా ఉండేందుకు బిజెపి, టిఎంసి మతతత్వాన్ని, ఆ భావాలను విస్త్రుతంగా వ్యాప్తి చేస్తున్నాయి. మతతత్వ భావజాలాన్ని ఎదుర్కొంటూనే, ప్రజల జీవితాలను హత్తుకునే అంశాలపై వామపక్ష కూటమి ప్రచారం నిర్వహిస్తోంది.

జీవనోపాధికి విఘాతం
డార్జిలింగ్‌ మినహా మిగిలిన మూడు నియోజకవర్గాలు షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వ్‌ చేయబడ్డాయి. అడవులపై ఆధారపడి జీవించే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అటవీ పరిరక్షణ చట్టం, అటవీ ఖనిజాల వినియోగ చట్టంలో కేంద్రం చేసిన సవరణలు పర్యావరణ సమతుల్యతకు, గిరిజనుల జీవనోపాధికి విఘాతం కలిగిస్తున్నాయి. అటవీ ఆక్రమణలను, దోపిడీలను ప్రోత్సహించే ఈ విధానాలను ఎన్నికల్లోనూ ప్రయోగిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలు క్షీణతను ఎదుర్కొంటున్నాయి. పాఠశాల, కళాశాల స్థాయిల్లో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి.

కార్మికుల వలసలు
ఆల్‌ ఇండియా ప్లాంటేషన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి జియావుల్‌ ఆలం మాట్లాడుతూ.. 1953 టిఈ చట్టాన్ని బిజెపి రద్దు చేయడంతో పాటు టీ మార్కెటింగ్‌, నియంత్రణ వ్యవస్థలో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ ఉత్పత్తి, నాణ్యత, వేలం, ఎగుమతి, దిగుమతులు, ధరల స్థిరత్వంపై ఎటువంటి నియంత్రణ లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థల తోటలు కూడా క్షీణించాయి. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రసిద్ధ డార్జిలింగ్‌ టీ ఉత్పత్తి సగానికి పడిపోయింది. కనీస వేతనాల్లేని కారణంగా ఆ రంగంపై ఆధారపడ్డ కార్మికులు ఇతర ఉద్యోగాలు వెతుక్కుంటూ దూరప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. బెంగాల్‌, బిజెపి పాలిత అస్సాంలో కార్మికులకు రోజుకు కనీస వేతనం రూ.250 ఉంది. కేంద్రం డిజిటల్‌ ఇండియా ప్రకటన ప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలూ అందలేదు… అని జియావుల్‌ ఆలం చెప్పారు. బెంగాల్‌లోని తేయాకు తోటలకు కేంద్ర విధానాల వల్ల కలిగే నష్టం చాలా ఘోరమైనది.

➡️