ఉత్తరాఖండ్‌ హింసాకాండలో ఐదుకు చేరిన మరణాల సంఖ్య

Feb 10,2024 10:34 #Uttarakhand, #violence rises
  • ముగ్గురి పరిస్థితి విషమం
  • అల్లరి మూకలపై జిల్లా మేజిస్ట్రేటు ఆరోపణలు
  • గాయపడిన పోలీసులతో సీఎం పుష్కర్‌సింగ్‌ ధమీ భేటీ

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. తాజా పరిస్థితిపై జిల్లా మేజిస్ట్రేట్‌ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అల్లరి మూక పోలీస్‌ స్టేషన్‌లో చిక్కుకున్న పోలీసు సిబ్బందిని సజీవ దహనం చేయటానికి యత్నించిందని తెలిపారు. బన్‌భూల్‌పురా ప్రాంతంలోని నాజూల్‌ ల్యాండ్‌లో మసీదు, మదర్సాలను అక్రమ నిర్మాణాల పేరుతో స్థానిక అధికార యంత్రాంగం కూల్చివేత డ్రైవ్‌ను నిర్వహించటంతో గురువారం హింస చెలరేగిన విషయం తెలిసిందే. కూల్చివేత డ్రైవ్‌కు వచ్చిన పోలీసులు, కార్మికులపై రాళ్లు రువ్వడం, కార్లను తగులబెట్టటం, పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టడం వంటివి అల్లరి మూకలు చేశాయి. దీంతో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధమి.. కనిపిస్తే కాల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.సీఎం శుక్రవారం జిల్లాకు వచ్చి గాయపడిన పోలీసు సిబ్బందిని పరామర్శించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల నిరోధక డ్రైవ్‌ కొనసాగుతోందనీ, పరిపాలన యంత్రాంగం ముందుగానే ప్రజలకు తెలియజేసిందని ఆయన అన్నారు. అల్లర్లకు కారకులైనవారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. ఉత్తరాఖండ్‌ డీజీపీ అభినవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య ఐదుకు పెరిగిందన్నారు. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారన్నారు. జిల్లాలో కర్ఫ్యూ కొనసాగటంతో పాటు భారీగా పోలీసులను మోహరించారు.

➡️