ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు.. సెలవులు పొడిగింపు

Jan 7,2024 11:55 #cold weather, #Delhi Schools

 న్యూఢిల్లీ :  ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్‌ సగటు కంటే ఓ డిగ్రీ ఎక్కువ. దీంతో సీజన్‌ సగటు కంటే ఎక్కువ పొగమంచు వ్యాపించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఉదయం 8.30 గంటలకు తేమ శాతం 79 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో పాఠశాలలకు సెలవులను పొడిగించింది. నర్సరీ నుండి 5వ తరగతి వరకు జనవరి 12 వరకు ఢిల్లీ ప్రభుత్వం సెలవులు పొడిగించింది.

ప్రస్తుతం ఉన్న చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలోని పాఠశాలలు వచ్చే ఐదు రోజుల పాటు మూసివేయబడతాయని ఢిల్లీ మంత్రి అతిషి పేర్కొన్నారు. చలిగాలులు తీవ్రమవడంతో ఐఎండి దేశ రాజధాని ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 10 గంటలకు వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) 341 పేలవంగా నమోదైనట్లు సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సిపిసిబి) పేర్కొంది. రైళ్ల సేవలపై కూడా తీవ్ర ప్రభావం పడినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఢిల్లీకి వెళ్లే 22 రైళ్లు గంట నుండి ఆరుగంటల ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించింది.

➡️