‘వారికి’ వారంలో ఐదు రోజులే పని

Mar 11,2024 10:40 #banks, #working days
DFS has approved the work of public sector bank employees

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల పనికి ఆమోదం తెలిపిన డిఎఫ్‌ఎస్‌
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులందరికీ వారంలో ఐదు రోజుల పనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్‌ఎస్‌) ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సివుంది. అలాగే, 2022, నవంబర్‌ 01 నుంచి అమలులోకి వచ్చే వార్షిక వేతన పెంపులో 17 శాతం పెంపుపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ), బ్యాంకుల యూనియన్లు రెండూ ఏకాభిప్రాయాన్ని వచ్చినట్లు ఐబిఎ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ మెహతా ఆదివారం ట్వీట్‌ చేశారు. కాగా ‘ఐదు రోజుల పని’ నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు రూ.8,284 కోట్ల వార్షిక వ్యయమవుతుందని అంచనా. 2022, నవంబర్‌ నుంచి అమలులోకి వచ్చే వేతన పెంపు సుమారు 800,000 మంది బ్యాంక్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిసింది. సవరించిన వేతన పరిష్కారంలో, మహిళా ఉద్యోగులకు మెడికల్‌ సర్టిఫికేట్‌ అవసరం లేకుండా నెలకు ఒక అనారోగ్య సెలవు రోజు మంజూరు చేస్తారు. అదనంగా, పదవీ విరమణ తర్వాత లేదా సేవ సమయంలో ఉద్యోగి మరణించిన సందర్భంలో సేకరించిన ప్రివిలేజ్‌ లీవ్‌ను 255 రోజుల వరకు నగదుగా మార్చుకోవచ్చు. రిటైర్డ్‌ వ్యక్తులు ఎస్‌బిఐతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పెన్షన్‌ లేదా కుటుంబ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా చెల్లింపును అందుకుంటారు. 2022, అక్టోబర్‌ 31లోపు పెన్షన్‌ పొందే అర్హత ఉన్న పెన్షనర్‌లు, ఫ్యామిలీ పెన్షనర్‌లకు, ఆ నిర్దిష్ట తేదీన పదవీ విరమణ చేసిన వారితో సహా ఇది వర్తిస్తుంది. ఈ అంశంపై ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సివుంది.

➡️