మావోయిస్టులను వదలం

Apr 18,2024 00:38 #encounter, #mavoist
  • రక్షణ ప్రాంతాలు లేకుండా చేస్తాం
  •  భారీ ఎన్‌కౌంటర్‌కు కొద్దిరోజుల ముందు ఇంటర్వ్యూలో బస్తర్‌ ఐజి

దండకారణ్యంలో 29 మంది మావోయిస్టులను బలిగొన్న కాంకర్‌ ఘటన కలకలం రేపింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇంతపెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు కొద్దిరోజుల ముందు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మావోయిస్టులను వదలేది లేదని, దండకారణ్యంలో వారికున్న కొద్దిపాటి రక్షణ ప్రాంతాలను (సేఫ్‌ పాకెట్స్‌)ను లేకుండా చేస్తామని బస్తర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి.సుందర్‌రాజ్‌ చెప్పారు. పదకొండేళ్ల పాటు మావోయిస్టు ప్రభావ ప్రాంతాల్లోనే వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన చెప్పిన విషయాలు క్లుప్తంగా..

ప్ర: ఎన్నికల ముందు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు?
జ: బస్తర్‌లో 60 వేల మంది భద్రతా సిబ్బంది ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. వీరిలో మా ప్రత్యేక బృందాలతో పాటు, ఎన్నికల కమిషన్‌ పంపిన అదనపు బలగాల సిబ్బంది కూడా ఉన్నారు.

ప్ర: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐఇడి పేలుళ్లలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. ఈ సారి అలాంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ: ఐఇడిలు పెద్ద ముప్పుగా మారాయి. నిజానికి అవి మాకు సవాల్‌ విసురుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మందుపాతరలను నిర్వీర్యం చేసే చర్యలను పెద్దఎత్తున చేపట్టాం. వీటిని కొనసాగిస్తాం. ఇప్పటివరకు 55 మందుపాతరలు దొరికాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది చనిపోయింది నిజం. కానీ, గతంతో పోలిస్తే ఇటువంటి సంఘటనల్లో ప్రాణనష్టం కనిష్టస్థాయికి చేరింది.

ప్ర: మావోయిస్టులను అదుపు చేయడానికి ఎటువంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు?
జ: మేం బహుముఖ విధానాలతో పనిచేస్తున్నాం. ప్రధానంగా మావోయిస్టుల కార్యక్రమాలను అదుపుచేయడంపై దృష్టి పెడుతున్నాం. అంతర్‌రాష్ట్ర కార్యకలాపాలపై నియంత్రణ సాధిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. రోడ్లు, వంతెనలు, మొబైల్‌ నెట్‌ వర్క్‌తో ఈ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల ఇక్కడి ప్రజల మనస్సుల్లోంచి తాము ఒంటరి వాళ్లమన్న భావనను తుడిచివేస్తున్నాం.

ప్ర: గత ఏడాది (24) కాల్చివేయబడ్డ మావోయిస్టుల కంటే ఈ ఏడాది ఇప్పటికే (50) ఎక్కువమంది మావోయిస్టులు మరణించారు. (కాంకర్‌ ఘటన జరగలేదు) దీని ప్రభావం ఎన్నికల వేళ ఉండదా?
జ: మావోయిస్టు క్యాడర్‌ అంతరించి పోతున్నప్పటికీ, మాకు నష్టం కలిగించే వారి శక్తి, సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయడం లేదు. మందుపాతరల రూపంలో ముప్పు పొంచే ఉంది, అవసరమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నాం.

ప్ర: ఇటీవల జరిగిన సంఘటనలను బూటకపు ఎన్‌కౌంటర్లని కుటుంబ సభ్యులు ఆరోపించారు…?
జ: స్థానిక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, భద్రతా బలగాలు తప్పుచేశాయన్న భావనను సృష్టించ డానికి మావోయిస్టలు ఈ తరహా ప్రచారం చేస్తారు.

ప్ర: బస్తర్‌లో మావోయిస్టుల ప్రభావం ఎలా ఉంది?
జ: బీజాపూర్‌, సుక్మా.కంకేర్‌లో వారికి కొన్ని స్థావరాలు ఉన్నాయి. అక్కడ మేం కూడా స్థిరంగా ఉన్నాం. అబుజ్‌మద్‌ వంటి కొన్ని ప్రాంతాల్లో సమస్య ఉంది. బీజాపూర్‌లోని నేషనల్‌ పార్కు సురక్షిత రవాణా మార్గంగా ఉంది. బీజాపూర్‌, సుక్మా వద్ద సరిహద్దుల్లోనూ ఈ తరహా ప్రాంతం ఉంది. ఇవి సీనియర్‌ మావోయిస్టులకు రక్షణ ప్రాంతాలుగా మారాయి. వీటిని వారు సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నారు. అక్కడ నుండి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా రక్షణ పొందుతున్న మావోయిస్టులను ఎవరినీ వదలం. రక్షణ ప్రాంతాలు (సేఫ్‌ ప్యాకెట్లు)ను పూర్తిగా నిర్మూలిస్తాం.

ప్ర: 11 సంవత్సరాలు మీరు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోనే పనిచేశారు. మీ పరిశీలన ఏమిటి?
జ: నేను 2005-2006లో అవిభక్త బస్తర్‌లో ఎఎస్‌పిగా మొదట విధుల్లో చేరాను. 2004 నుండి 2014 వరకు మావోయిస్టుల కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. భద్రతా సిబ్బందితోపాటు, సామాన్య ప్రజలు కూడా ఈ కాలంలో పెద్ద ఎత్తున మరణించారు. అప్పుడు మా బలం కేవలం 25వేల మంది మాత్రమే. ఇప్పుడు దాదాపుగా లక్షమందిమి ఉన్నాము. సాంకేతిక అంశాల్లో స్పష్టమైన పైచేయి సాధించాం. జవాన్లకు జంగిల్‌ వార్‌ఫేర్‌లో శిక్షణ ఇచ్చాం. మొదట్లో కొంత సైద్ధాంతిక భావజాలంతో పనిచేసిన మావోయిస్టులు ఆ తరువాత ఎటువంటి భావజాలం లేకుండా పోయారు.

➡️