సామాన్యుడికి ఊరటేది?

May 23,2024 06:10 #common man, #easy for

చమురు ధరలు తగ్గినా ఒరిగిందేమీ లేదు
లాభాలు దండుకుంటున్న ఆయిల్‌ కంపెనీలు
డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కాసుల పంట
న్యూఢిల్లీ : మార్చి 31తో అంతమైన 2023-24 ఆర్థిక సంవత్సరంలో చమురు కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినప్పటికీ మన ఆయిల్‌ కంపెనీలు మాత్రం సంవత్సరం పొడవునా ఇంధన ధరలను తగ్గించనే లేదు. చమురు కంపెనీలకు లాభాల పంట పండడానికి ఇదే కారణం. మరో మాటలో చెప్పాలంటే చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తమ లాభాలను పెంచుకుంటుంటే సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. డివిడెండ్లు చెల్లిస్తామని చమురు కంపెనీలు హామీ ఇవ్వడంతో ప్రభుత్వం కూడా లాభపడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంతో పోలిస్తే గత సంవత్సరం వచ్చిన ఆదాయం అనేక రెట్లు అధికంగా ఉంది.
ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసిఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బిపిసిఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పిసిఎల్‌) 2023-24లో రూ.80,986 కోట్ల లాభాన్ని మూటకట్టుకున్నాయి. 2022ా23లో ఆ కంపెనీలు ఆర్జించిన లాభంతో పోలిస్తే ఇది నాలుగు రెట్ల కంటే ఎక్కువే. ఐఓసీఎల్‌, బిపిసిఎల్‌ను ప్రభుత్వమే నేరుగా నిర్వహిస్తోంది. హెచ్‌పిసిఎల్‌ మాత్రం మరో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జిసికి అనుబంధంగా ఉంది.

ఆయిల్‌ కంపెనీల లాభాలు ఇవే
ఐఒసిఎల్‌ 2021-22లో రూ.24,184 కోట్లు, 2022-23లో రూ.8,242 కోట్లు, 2023-24లో రూ.39,619 కోట్ల లాభాలు పొందింది. బిసిపిఎల్‌ 2021-22లో రూ.8,789 కోట్లు, 2022-23లో రూ.1,870 కోట్లు, 2023-24లో రూ.26,874 కోట్ల లాభాలు ఆర్జించింది. హెచ్‌పిసిఎల్‌ 2021-22లో రూ.39,335 కోట్లు, 2022-23లో రూ.19,086 కోట్లు, 2023-24లో రూ.80,986 కోట్ల లాభాలు సంపాదించింది.

చమురు కంపెనీలు ఏం చేస్తాయి?
చమురు మార్కెటింగ్‌ కంపెనీలు చేసే ప్రధానమైన పనులు ఏమిటంటే ముడి చమురును కొనుగోలు చేయడం, దానిని పెట్రోల్‌, డీజిల్‌, నాఫ్తా, లూబ్రికెంట్లు వంటి పెట్రోలియం ఉత్పత్తులుగా ప్రాసెస్‌ చేయడం, ఆ తర్వాత వాటిని మార్కెట్‌లో విక్రయించడం. చమురు మార్కెటింగ్‌ కంపెనీల లాభాలను ముఖ్యంగా రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి చమురు ధరలు. రెండు పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం ధరలు.

తొలుత వినియోగదారులకు ఊరట
రష్యాాఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత అంటే 2022 జూన్‌లో బ్యారల్‌ చమురును 116 డాలర్ల గరిష్ట ధరకు భారత్‌ కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ జరిపిన తర్వాత మన దేశంలో కొన్ని నెలల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలు ధర రూ.110కి చేరింది. 2022 ఏప్రిల్‌లో ఈ ధర సగటున రూ.105 పలికింది. దీంతో రోజువారీ ధరల సమీక్షను నిలిపివేయాలని చమురు కంపెనీలు నిర్ణయించాయి. రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధరను రూ.96.7, డీజిల్‌ ధరను రూ.89.62గా ఫ్రీజ్‌ చేశాయి. దీంతో అధిక చమురు ధరల నుండి వినియోగదారులకు ఊరట లభించింది. 2022 మార్చిాఆగస్ట్‌ నెలల మధ్య కూడా బ్యారల్‌ చమురు ధర 100 డాలర్లకు పైనే నడిచింది. అయితే వినియోగదారులకు రక్షణ ఉచితంగా ఏమీ లభించలేదు. అది చమురు మార్కెటింగ్‌ కంపెనీల లాభదాయకతపై గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపింది. అవి అధిక ధరకు చమురును కొనుగోలు చేసినప్పటికీ ఆ భారాన్ని వినియోగదారులపై మోపకుండా తామే భరించాయి.

లాభాల బాట పట్టినా…
2022 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్యకాలంలో అంటే రెండు త్రైమాసికాలలో చమురు కంపెనీలు నష్టాలు చవిచూసినప్పటికీ ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. వాస్తవానికి 2022ా23లో మూడు చమురు కంపెనీలు రూ.19,086 కోట్ల లాభం పొందాయి. ఆయిల్‌ కంపెనీలు త్వరితగతిన కోలుకోవడానికి ప్రధాన కారణమేమంటే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోవడం మొదలైంది. 2023 జూన్‌ నాటికి చమురు ధరలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 35% మేర తగ్గాయి. కానీ ఈ ప్రయోజనాలేవీ వినియోగదారులకు దక్కలేదు. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు రాలేదు. హమాస్‌ాఇజ్రాయిల్‌ ఘర్షణ నేపథ్యంలో అప్పటి నుండి చమురు ధరలు కొద్దో గొప్పో పెరుగుతూనే ఉన్నాయి. కానీ గరిష్ట స్థాయికి (116 డాలర్ల) చేరినప్పటి బ్యారల్‌ చమురు ధరతో పోలిస్తే 28% తక్కువగానే ఉన్నాయి. మన దేశంలో ఈ ఏడాది మార్చిలో లీటరు పెట్రోల్‌ ధరను రెండు రూపాయలు తగ్గించినప్పటికీ ఇంధన ధరల్లో మాత్రం మార్పు రాలేదు. ప్రారంభంలో అంతర్జాతీయ చమురు ధరల ప్రభావం వినియోగదారులపై పడకూడదని భావించి, అందుకు అనుగుణంగా ఆయిల్‌ కంపెనీలు చర్యలు తీసుకున్నప్పటికీ ఆ తర్వాత కాలంలో మాత్రం వాటి వైఖరిలో మార్పు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ఇక్కడ మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఏ మాత్రం తగ్గించలేదు.

సర్కారుకు డివిడెండ్లు
చమురు మార్కెట్‌ కంపెనీలు తాము ఆర్జించిన లాభాల్లో కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ ఇస్తామని హామీ ఇవ్వడంతో సర్కారు కూడా ప్రయోజనం పొందింది. 2022-23లో ప్రభుత్వానికి ఐఒసిఎల్‌ నుండి రూ.2,182 కోట్ల డివిడెండ్‌ అందగా 2023-24లో రూ.8,727 కోట్లు అందింది. అదే సమయంలో బిపిసిఎల్‌ నుండి పొందిన డివిడెండ్‌ రూ.460 కోట్ల నుండి రూ.2,413 కోట్లకు పెరిగింది. హెచ్‌పిసిఎల్‌ నుండి రూ.1,635 కోట్ల డివిడెండ్‌ వచ్చింది.

➡️