జార్ఖండ్‌ మంత్రి అలంగిర్‌కు ఇడి సమన్లు

రాంఛి : జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత అలంగిర్‌ ఆలం(70)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు ఆదివారం నాడు వెల్లడించారు. మనీలాండరింగ్‌ కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆయనను ఇడి ఆదేశించింది. ఈ కేసులో ఆలంగిర్‌కు సంబంధించిన ఒక ఇంటిలో రూ.32 కోట్ల నగదు ఇటీవల ఇడి స్వాధీనం చేసుకుంది. ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్‌ను, ఇంటి సహాయకుడిని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంఛిలోని ఇడి జోనల్‌ కార్యాలయంలో మంగళవారం జరిగే విచారణకు హాజరవ్వాలని ఆలంకు పంపిన సమన్లలో పేర్కొన్నారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఇ) కింద ఆయన వాగ్మూలాన్ని ఇడి అధికారులు రికార్డు చేయనున్నట్లు తెలిసింది. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఇడి ఆరోపిస్తోంది. అయితే తనకు సంజీవ్‌ లాల్‌ జరిపిన లావాదేవీలతో సంబంధం లేదని ఆలం పేర్కొంటున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సంజీవ్‌ను ఆయన దూరం పెట్టినట్టు తెలుస్తోంది.

➡️