సిఎఎ కింద పౌరసత్వం కోసం పాక్‌ హిందువుల ప్రయత్నాలు

  •  ఇంటర్వ్యూల కోసం ఎదురుచూపులు

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న పాకిస్తానీ హిందువులు శనివారం సెంట్రల్‌ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ పోస్టాఫీస్‌లో తమ వంతు ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్నారు. రైల్వే, పోస్టల్‌ శాఖ అధికారులతో కూడిన కమిటీ ముందు వారు హాజరు కావాల్సి వుంటుంది. 2014 జూన్‌లో భార్యా,పిల్లలతో పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన కన్వర్‌లాల్‌ సిఎఎ కింద దరఖాస్తు చేసుకోవడంతో శనివారం ఇంటర్వ్యూకు రావాల్సిందిగా సందేశం రావడంతో వచ్చారు. దాదాపు 40నిముషాల పాటు ఇంటర్వ్యూ జరిగిందని, శరణార్ధుల కాలనీ సమీపంలో గల పూజారి జారీ చేసిన అర్హతా సర్టిఫికెట్‌తో సహా అన్ని పత్రాలను తీసుకువచ్చానని, అయినా నోటరీతో అటెస్ట్‌ చేయించాల్సిన అఫిడవిట్‌ లేదనే కారణంతో తన దరఖాస్తును తిరస్కరించారని లాల్‌ తెలిపారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలకు పూర్తి చేయాల్సిన డాక్యుమెంట్లు చాలా వుండేవని, తాజాగా సిఎఎ వచ్చిన తర్వాత తమ పని సులభమైందని అమర్‌నాథ్‌ అద్వానీ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న తమ డిమాండ్‌ ఇప్పుడు నెరవేరే అవకాశం వచ్చిందన్నారు. దేశంలో కింది స్థాయిల్లో పోస్టల్‌కార్యాలయాలు, రైల్వేలు వున్నందున సిఎఎ అమలుకు ఆ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సీనియర్‌ అధికారి తెలిపారు.

➡️