తమిళనాడులో ఘోరం- బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Feb 17,2024 22:12 #An explosion, #fireworks industry

-తొమ్మిది మంది మృతి

-పలువురికి గాయాలు

-ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు

చెన్నై : తమిళనాడులో ఘోరం జరిగింది. విరుధునగర్‌ జిల్లాలోని ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ తీవ్రతతో పేలుడు చోటు చేసుకుంది.. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని కెమికల్‌ మిక్సింగ్‌ రూమ్‌లో ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.వెంబకొట్టరు ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రత అధికంగా ఉన్నదనీ, దీని ధాటికి ఫ్యాక్టరీతో పాటు దగ్గరలోని నాలుగు భవనాలు కూలిపోయాయని స్థానికులు చెప్పారు. ఈ ఫ్యాక్టరీ యజమాని పేరు విజయ్ అని, భారీ పేలుడుతో మంటలు ఎగిసి పడ్డాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు, ఫైర్‌ విభాగం ప్రమాద స్థలానికి చేరుకుంది. గాయాల పాలైనవారిని దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారనీ, తీవ్ర గాయాల పాలైన ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలోనూ పలు ఫ్యాక్టరీల్లో ఇలాంటి పేలుళ్లే జరిగి ప్రాణ, ధన నష్టానికి దారి తీశాయి. గతేడాది రాష్ట్రంలోని క్రిష్ణగిరిలో గల ఒక ఫ్యాక్టరీలో పేలుడు జరిగి ఎనిమిది మంది చనిపోయారు. ఫ్యాక్టరీలో పేలుళ్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలనీ, ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

➡️