స్వదేశంలోనే పరాయి వాళ్లమయ్యాం

Feb 26,2024 22:45 #Delhi, #Dharna, #rythu
  • పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆవేదన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సొంత దేశంలోనే పరాయి వాళ్లమయ్యామంటూ రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పి) చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు వచ్చి, 14 రోజులుగా పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరి సరిహద్దుల్లో వద్ద వేచివున్న రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అమృత్‌ సింగ్‌ అనే రైతు మాట్లాడుతూ.. సొంత దేశంలో పరాయి వాళ్లం అయిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని అన్నారు. ఒక వస్తువు తయారీదారు దాని ధరను నిర్ణయిస్తున్నాడని, రైతుకు ఆ హక్కు లేకుండా పోయిందని అన్నారు. ఎంఎస్‌పికి చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. ‘ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని కుటుంబ పెద్ద దృష్టికి తీసుకెళ్తాం. మేం కూడా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. మమ్మల్ని శత్రువులుగా చూస్తూ లాఠీలతో కొట్టిస్తూ, టియర్‌ గ్యాస్‌ వంటివి ప్రయోగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. రైతుల డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నదాతలు స్పష్టం చేశారు.

రైతును గోనె సంచిలో కుక్కి… కొట్టిన హర్యానా పోలీసులు

ఈ నెల 24న ప్రీత్‌పాల్‌ సింగ్‌ (ఆ కుటుంబం ఏకైక కుమారుడు)ను చివరకు హర్యానాలోని రోహ్ తక్‌ పిజిఐ నుండి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పిజిఐ) చండీగఢ్‌కు మార్చారు. అక్కడ ఆయన తీవ్ర గాయాలతో అడ్మిట్‌ అయ్యాడు. ఆయన కాలు, ముక్కు, దవడలో పగుళ్లు, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. సంగ్రూర్‌ జిల్లా మూనాక్‌ సబ్‌ డివిజన్‌లోని నవాంగావ్‌ గ్రామానికి చెందిన ప్రీత్‌పాల్‌ను ఈ నెల 21న పంజాబ్‌ వైపు ఖానౌరీ సరిహద్దు నుండి హర్యానా పోలీసులు పట్టుకున్నారు. గోనె సంచిలో కుక్కి, నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ప్రీత్‌పాల్‌ తల్లి లఖ్వీర్‌ కౌర్‌ తన కుమారుడి శస్త్రచికిత్స కోసం పిజిఐ చండీగఢ్‌లో ఉన్న ఆమె, జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ నెల 21న ప్రీత్‌పాల్‌ పంజాబీ భూ భాగంలోని ఖనౌరీ సరిహద్దులో ఉన్నాడు. హర్యానా పోలీసులు రైతులపై అకస్మాత్తుగా టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ విసరడం ప్రారంభించారు. రైతులు తమను తాము రక్షించుకోవడానికి పరిగెత్తడం ప్రారంభించినప్పుడు, హర్యానా పోలీసులు ఖనౌరీ సరిహద్దును దాటి నా కొడుకును ఎత్తుకెళ్లారు. గోనె సంచిలో పడేసి స్పృహ కోల్పోయే వరకు కర్రలు, రాడ్లతో నిర్దాక్షిణ్యంగా కొట్టారు’ అని చెప్పారు. ‘ప్రీత్‌పాల్‌ రెండు మొబైల్‌ ఫోన్‌లను తీసుకెళ్లేవాడు. ఒకటి హర్యానా పోలీసులు లాక్కోగా, రెండోది ఆయన జేబులో ఉండిపోయింది. నా కొడుకును కొట్టిన తరువాత, పొలాల్లోకి విసిరేశారు. కానీ తరువాత వారు ఆయన పరిస్థితిని చూసి, హర్యానాలోని నర్వానాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రీత్‌పాల్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడు, ఆయన కాల్‌ చేసి, జింద్‌ జిల్లా నర్వానాకు తీసుకెళ్లినట్లు తెలియజేశాడు’ అని ఆమె పేర్కొన్నారు. ‘ఈ విషయాన్ని హర్యానాలోని మా బంధువులకు సమాచారం ఇచ్చాం. వారు అంబులెన్స్‌ను వెంబడించగలిగారు. మొదట నర్వానాలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పిజిఐ రోహ్ తక్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ నా కొడుకు మూడు రోజులు ఉన్నాడు’ అని ఆమె తెలిపారు.

పిజిఐ రోహ్ తక్‌లో హర్యానా పోలీసులు, సివిల్‌ దుస్తుల్లో ఉన్న కొందరు ప్రీత్‌పాల్‌ గది బయట మోహరించడంతోపాటు, ఏ ఫోన్‌ కాల్‌ వచ్చినా సివిల్‌ డ్రెస్‌లో ఉన్న మగవాళ్లు తమను అనుసరించేవారని, మాట్లాడింది వినడానికి ప్రయత్నించేవారని, రాత్రింబవళ్లు తమకు ట్రాక్‌ చేస్తూనే ఉన్నారని చెప్పారు. మీడియాతో మాట్లాడవద్దని బెదిరించారని తెలిపారు. రైతు సంఘం నాయకుడు బల్దేవ్‌ సింగ్‌ సిర్సా పంజాబ్‌కు తాము తిరిగి వెళ్లడానికి, ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ సహాయం చేశారని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ప్రీత్‌పాల్‌కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. రైతు సంఘాలు పంజాబ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రీత్‌పాల్‌ పంజాబ్‌కు తిరిగి రావడం సాధ్యమైంది. పంజాబ్‌ చీఫ్‌ సెక్రటరీ అనురాగ్‌ వర్మ, హర్యానా చీఫ్‌ సెక్రటరీ సంజీవ్‌ కౌశల్‌కు ప్రీత్‌పాల్‌ సింగ్‌ను చికిత్స కోసం తిరిగి పంపాలని లేఖ పంపారు. ప్రీత్‌పాల్‌ సింగ్‌ నివాసానికి ఎస్‌కెఎం నేతలు వెళ్లి, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

➡️