ఫెడరలిజం రక్షణకై పోరాటం : కేరళ సిఎం పినరయి విజయన్

fight to protect federalism Kerala-protest-delhi vijayan speech
  • ప్రజాస్వామ్యంలో చారిత్రాత్మకమైన రోజు
  • ఇల్లు ప్రతి ఒక్కరి హక్కు.. కానుక కాదు
  • దేశం గర్వించదగ్గ విజయాలు ఎన్నో సాధించాం 
  • ఐక్యత, లౌకికవాదాన్ని కొనసాగిద్దాం

న్యూఢిల్లీ : దేశంలోని ఫెడరలిజాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్న వ్యవస్థకు వ్యతిరేకంగా కేరళ పోరాడుతోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఫిబ్రవరి 8ని చారిత్రాత్మక దినంగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మందిర్‌లో చేపట్టిన మహాధర్నాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోని ఫెడరలిజాన్ని నాశనం చేసే వ్యవస్థపై కేరళ కూడా నిరసన వ్యక్తం చేస్తోందని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేంద్రం.. కేరళ, ఇతర బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల వివక్షాపూరిత ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు. మధ్యంతర బడ్జెట్ మళ్లీ రాష్ట్రాన్ని విస్మరించిందన్నారు. ప్రభుత్వ విధానాలు కేరళ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు.. కేరళ అనేక రంగాల్లో ఎన్నో విజయాలు సాధించిందని, కానీ కేంద్రం ఆ విజయాలను శిక్షించే విధంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రాష్ట్రం యొక్క ఏ ఒక్క డిమాండ్‌ను కూడా కేంద్రం వింటున్నట్టు లేదని, ఆర్థిక సంఘం రాష్ట్ర మార్గదర్శకాలను ఆమోదించదని పేర్కొన్నారు.

లైఫ్ స్కీమ్ కింద నిర్మించే ఈ ఇళ్లకు సెంట్రల్ స్కీమ్ బోర్డు ఉండాలని, లేదంటే కేంద్రం నుంచి వచ్చే చిన్నపాటి కేటాయింపులు కూడా అనుమతించబోమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. లైఫ్ భవన్ పథకంలో భాగంగా ఈ ఏడాది జనవరి 22 వరకు 3,71,934 ఇళ్లను నిర్మించగా, 32,751 ఇళ్లకు మాత్రమే పీఎంఏవై గ్రామీణ్ నుంచి రూ.72,000 చొప్పున సాయం అందిందని వెల్లడించారు. పీఎంఏవై అర్బన్‌లో భాగంగా కేంద్రం 80,259 ఇళ్లకు రూ.1,50,000 ఇచ్చిందని, రెండు పథకాల లబ్ధిదారులకు మిగిలిన మొత్తం నాలుగు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. మొత్తం మీద 1,13,010 కుటుంబాలు (30.38%) నామమాత్రంగా కేంద్ర సహాయం పొందాయని తెలిపారు. మిగిలిన 2,58,924 ఇళ్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల ఖర్చుతో నిర్మించామని పేర్కొన్నారు. లైఫ్ మిషన్ కోసం ఇప్పటికే 17,104.87 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2081 కోట్లు(12.17 శాతం) మాత్రమే కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. మిగిలిన 87.83 శాతం చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బ్రాండింగ్‌కు సిద్ధంగా లేదని తెలిపారు. ఎందుకంటే ఇల్లు ప్రతి ఒక్కరి హక్కు.. కానుక కాదు అని తాము భావిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

సమైక్యాన్ని అస్థిరపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాయని తెలిపారు. కానీ ప్రధానమంత్రి దక్షిణ భారత రాష్ట్రాలు దేశ ఐక్యతకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఐక్యత మరియు లౌకికవాదాన్ని కొనసాగించడానికి దక్షిణ భారత రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని సామాన్యులకు, మధ్యతరగతికి ఏమీ చేయరాదన్నది కేంద్ర వైఖరిగా ఉందని తెలిపారు. పోరాటాల ద్వారా ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కూడా వినూత్న మార్గాలను అన్వేషిస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్ర నిర్వహణ లోపం వల్లే ఆర్థిక భారం పడుతుందని ఓ వర్గం ఆరోపిస్తోందని, కానీ రాష్ట్రం సొంత ఆదాయంతో సహా పెరిగిందని తెలిపారు. కేంద్రం వివక్షతతో వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. కేరళ పన్ను ఆదాయంగా రూ.79 వసూలు చేస్తుండగా కేంద్రం రూ.21 ఇస్తోంది. అదే యూపీకి 100కి 46, బీహార్‌కు 70, కేరళకు మాత్రం 21. ఇది వివక్ష కాకపోతే ఏమిటని ప్రశ్నించారు.
వరదలు, అంటువ్యాధులు వచ్చినా నిలబడి పోరాడిన చరిత్ర కేరళకు ఉందన్నారు. మానవత్వం, సౌభ్రాతృత్వాన్ని నిలబెట్టి రాష్ట్రం ప్రతి సంక్షోభాన్ని ఐక్యంగా అధిగమించిందని వెల్లడించారు. దేశం గర్వించదగ్గ విజయాలు ఎన్నో సాధించామని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ యొక్క పేదరిక సూచికలో అతి తక్కువ రాష్ట్రంగా, నీతి ఆయోగ్ రూపొందించిన సుస్థిరాభివృద్ధి సూచికల ప్రకారం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా, పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2021లో నంబర్ వన్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఎక్సలెన్స్ ఇండెక్స్‌లో నంబర్ వన్, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ లో అత్యంత ఉచిత చికిత్స అందించిన రాష్ట్రంగా కేరళ నిలిచిందన్నారు. గత 8 ఏళ్లలో కేరళ లెక్కలేనన్ని విజయాలు సాధించిందని వివరించారు. ప్రభుత్వ ఆరోగ్య మంథన్ అవార్డుతో మొదలై ఇండియా టుడే నిర్వహించిన హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వేలో కేరళ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అయితే కేరళను సమర్ధత నుంచి మరింత సమర్ధతకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వకుండా, ఆ ప్రగతికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహించారు. వరదలు, అంటువ్యాధుల సమయంలో తగిన సాయం అందించకుండా అవసరాలకు వెన్నుపోటు పొడిచడమే కాకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

గవర్నర్ ను ఉపయోగించుకుని సమస్యలు సృష్టించే పద్ధతి రాష్ట్రంలోనూ అమలవుతోందని ద్వజమెత్తారు. రాష్ట్ర శాసనసభలను అదుపులో ఉంచుకునే ఇంపీరియల్ రెసిడెంట్‌ల మాదిరిగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారన్నారు. దీని వల్ల ఫెడరలిజం, ప్రజాస్వామ్య పరిరక్షణకు న్యాయ పోరాటాలు, ప్రజా పోరాటాలు అవసరమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా రోడ్డుపై కూర్చున్న గవర్నర్ కార్యకలాపాలకు కేరళ వేదికైందన్నారు.. ఛాన్సలర్‌షిప్‌ను ఉపయోగించడం వల్ల విశ్వవిద్యాలయాల పనితీరు కూడా తారుమారైందని, పాలసీ ప్రకటన చదవడానికి సమయం లేకున్నా గవర్నర్‌కు రోడ్డుపై కూర్చునే సమయం ఉందని ఎద్దేవా చేశారు.

ఈ సమస్యలన్నింటినీ వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి అందించామని, అన్ని విధాలా ప్రయత్నించినా ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇంత పోరాటానికి దిగామని తెలిపారు. వివక్షకు వ్యతిరేకంగా మౌనంగా ఉండలేమని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు. సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపిన వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

➡️