కేరళలో తొలిసారిగా పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగ పీఠిక

Jan 17,2024 22:05

తిరువనంతపురం : కేరళ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా, సవరించిన స్కూలు పాఠ్యపుస్తకాల్లో దేశ రాజ్యాంగ పీఠిక చేర్చనున్నారు. పిల్లల మనసులోకి రాజ్యాంగ విలువలను పాదుకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో దీన్ని చేర్చాలని సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. రాష్ట్ర సిలబస్‌ కమిటీ ఛైర్మన్‌ కూడా అయిన విద్యా శాఖ మంత్రి వి.శివన్‌కుట్టి ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 1, 3, 5, 7, 9 తరగతులకు 173 కొత్త పాఠ్యపుస్తకాలను రాష్ట్ర సిలబస్‌ సారధ్య కమిటీ ఇటీవల ఆమోదించింది. దశాబ్ద కాలం తర్వాత పాఠ్యపుస్తకాల సిలబస్‌లో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించేలా సంస్కరణలు తీసుకొస్తామని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మొదటనుండి చెబుతోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సిఇఆర్‌టి) డైరెక్టర్‌ జయప్రకాష్‌ ఆర్‌.కె. మాట్లాడుతూ, అనేక ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల్లో ఇప్పటికే రాజ్యాంగ పీఠిక వుందని, కేరళలో ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమమని తెలిపారు. టీచర్ల శిక్షణలో కూడా దీన్ని భాగం చేయనున్నట్లు చెప్పారు. అప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు రాజ్యాంగ పీఠిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు. పాఠ్యపుస్తకం ఏ మీడియం అయితే పీఠిక కూడా అదే భాషలో వుంటుందన్నారు. రాజ్యాంగం, విలువలపై దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో ఇటువంటి చర్య తీసుకోవడం వల్ల పిల్లల్లో చిన్ననాటి నుండే దీని ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి దోహదపడుతుందన్నారు.

➡️