ఇతరులకు కూడా అవకాశం ఇవ్వండి 

Feb 8,2024 09:23 #reservations, #Supreme Court
supreme court on Give others a chance too

రిజర్వేషన్‌ లబ్దిదారులకు సుప్రీం సూచన

న్యూఢిల్లీ : కులం ఆధారిత రిజర్వేషన్‌ నుండి ప్రయోజనం పొందిన వారు తమలో వెనుకబడిన మరింత మందికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలు, ఎస్టీల ఉప వర్గీకరణను చేపట్టవచ్చా అనే అంశంపై దాఖలైన కేసును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. పంజాబ్‌ ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాలకు 25% రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఎస్సీలను రెండు కేటగిరీలుగా వర్గీకరిస్తూ ఆ ప్రభుత్వం 1975లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారిస్తోంది. ‘వెనుకబడిన వారిలో ఇప్పటికీ వెనుకబడిన వారు ఉంటే వారికి రిజర్వేషన్లు కల్పిద్దాం. మీరు రిజర్వేషన్‌ పొంది ఉంటే ఆ ప్రయోజనం నుండి వైదొలగవచ్చు. ఈ విషయంలో ఎందుకు మినహాయింపు ఇవ్వకూడదు?’ అని న్యాయమూర్తి విక్రమ్‌ నాథ్‌ ప్రశ్నించారు. దీనిపై పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ గుర్మీందర్‌ సింగ్‌ స్పందిస్తూ ఉప వర్గీకరణ లక్ష్యం అదేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన సివిల్‌ సర్వీస్‌ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు కొనసాగించవచ్చా అని జస్టిస్‌ బీఎస్‌ గవారు కూడా ప్రశ్నించారు. దీనిపై సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ అలాంటి వారిని క్రీమిలేయర్‌గా వర్గీకరించవచ్చునని, వారిని రిజర్వేషన్ల నుండి మినహాయించాలని సూచించారు.

➡️