విద్వేష ప్రసంగాలతో ప్రధాని హోదాను దిగజార్చారు

May 31,2024 08:30 #comentes, #Manmohan Singh, #PM Modi
  • ప్రధాని మోడీ ప్రచారం తీరుపై మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరును మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్రంగా విమర్శించారు. విద్వేష ప్రసంగాలు, అనుచితమైన వ్యాఖ్యలతో ప్రధానమంత్రి తన హోదాను దిగజార్చారని పేర్కొన్నారు. తనపైనా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. తాను ప్రధానిగా వున్న సమయంలో ఏనాడూ ఏ ఒక్క కమ్యూనిటీని వేరుగా చూడలేదని స్పష్టం చేశారు. లోక్‌సభ తుది దశ పోలింగ్‌ సందర్భంగా పంజాబ్‌ ఓటర్లను ఉద్దేశించి ఆయన ఒక లేఖ రాశారు. ప్రస్తుతం భారతదేశం కీలకమైన దశలో వుందన్నారు. భారతదేశంలో నియంతృత్వ పాలనను ప్రారంభించడానికి నిరంకుశ ప్రభుత్వం పదేపదే చేస్తున్న దాడుల నుండి ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. గత పదేళ్లుగా, పంజాబ్‌ను, పంజాబీలను, పంజాబ్‌తత్వాన్ని దూషించడంలో బిజెపి ప్రభుత్వం ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదన్నారు. ముస్లింలకే మొదటి హక్కు వుంటుందని తాను వ్యాఖ్యలు చేసినట్టు తన ప్రసంగానికి తప్పుగా భాష్యం చెప్పారంటూ మోడీని విమర్శించారు.
ఈ ఎన్నికల సందర్భంగా సాగిన రాజకీయా ప్రచారాన్ని నిశితంగా పరిశీలించానని, ప్రధాని మోడీ తన హోదాకు తగిన రీతిలో కాకుండా అత్యంత విషపూరితమైన విద్వేష ప్రసంగాలకు పాల్పడారు. ఆయన ప్రసంగాలన్నీ విభజనరీతిలోనే సాగాయి. ఈ పదవి స్థాయిని తగ్గించిన తొలి ప్రధాని ఆయనేనని అన్నారు. ప్రతిపక్షాలను ఉద్దేశించో లేదా సమాజంలోని ఏదొక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునో మోడీ తన ప్రచారాన్ని సాగించారని మన్మోహన్‌ విమర్శించారు. తనపైన కూడా కొన్ని అబద్ధపు ప్రకటనలు చేశారన్నారు. దేశ ప్రజలు ఇవన్నీ చూస్తునే వున్నారన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరించిన వ్యవసాయ, ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించారు. 750మందికి పైగా రైతులు ముఖ్యంగా పంజాబ్‌కి చెందినవారు నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో వేచిచూసి అమరులయ్యారని గుర్తు చేశారు. లాఠీలు, రబ్బర్‌ బుల్లెట్లు చాలవన్నట్లు స్వయాన ప్రధానే మన రైతులను ‘ఆందోళనజీవులు’ పరాన్నజీవులు అంటూ పార్లమెంట్‌ వేదికగా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తమను సంప్రదించకుండా తమపై రుద్దిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్నదే వారి ఏకైక డిమాండ్‌ అని అన్నారు. గత పదేళ్ళుగా ఆయన అనుసరించిన విధానాలు రైతుల ఆదాయాలను తుడిచిపెట్టేశాయన్నారు. రైతుల జాతీయ సగటు నెలవారీ ఆదాయం కేవలం రోజుకు రూ.27 అని అన్నారు. కానీ వారి సగటు రుణ భారం రూ.27వేలు వుందన్నారు.
దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవలు విలువ కేవలం నాలుగేళ్లకే పరిమితం చేయాలని బిజెపి భావించిందని, అందుకే అగ్నివీర్‌ పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. బూటకపు జాతీయవాదాన్ని ఇది ప్రదర్శిస్తోందన్నారు. పదేళ్ల బిజెపి ఆర్థిక విధానాలను మన్మోహన్‌ ఘాటుగా విమర్శించారు. పెను విపత్తుగా మారిన పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జిఎస్‌టి, కోవిడ్‌ సమయంలో నిర్వహణాలోపాలు, జిడిపి వృద్దిరేటు క్షీణత ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ఊహించలేని సంక్షోభంలోకి నెట్టివేశాయన్నారు. దేశంలో ప్రేమ, శాంతి, సోదర భావం, సామరస్యత విల్లివిరియడానికి గల చివరి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

➡️