దుబాయ్ లో భారీ వర్షాలు

Mar 10,2024 09:50 #dubai, #heavy rains
  • నదులను తలపిస్తున్న రహదారులు
  • పలు విమాన సర్వీసులు రద్దు

దుబాయి : ఎడారి దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)లో కుండపోత వర్షాలతో శనివారం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వర్షాల ధాటికి దుబాయ్ లోని రహదారులు నదులను తలపించాయి. దుబాయ్ సంవత్సర సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్లుగా ఉండగా..శనివారం కేవలం 6 గంటల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
కాగా భారీ వర్షాల కారణంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. భారీ వర్షాల కారణంగా యుఎఇ జాతీయ వాతావరణ కేంద్రం పలు ప్రాంతాల్లో ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు, బీచ్‌లకు దూరంగా ఉండాలని సూచించింది.
ఇండోనేసియాలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సుమత్రా ద్వీపంలో కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల పది మంది ప్రాణాలు కోల్పాయారు. మరో 10 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని పలు గ్రామాల్లో ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయని, చెట్లు నేలకూలాయని రెస్క్యూ అధికారి డోని యుస్రిజల్‌ తెలిపారు.

➡️