వృద్ధాప్య  పింఛన్‌ వయస్సును పదేళ్లకు తగ్గించిన జార్ఖండ్‌ ప్రభుత్వం

రాంచీ :   వృద్ధాప్య పింఛన్‌ వయస్సును పదేళ్లకు తగ్గిస్తున్నట్లు జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా శుక్రవారం రాంచీలోని మొరదబడి మైదానంలో జరిగిన ఓ కార్యక్రమంలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా చీఫ్‌, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రెండు కీలక ప్రకటనలు చేశారు. దళితులు, గిరిజనులకు వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 60 నుండి 50 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో స్థాపించే కంపెనీలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్‌ చేయబడతాయని అన్నారు.

జార్ఖండ్‌ దేశంలోనే అత్యంత పేద దేశమని, కొవిడ్‌ సంక్షోభంతో ఇప్పటికి పోరాడుతున్నామని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి గందరగోళం లేదని సోరెన్‌ పేర్కొన్నారు. జార్ఖండ్‌ వంటి పేద రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ఆక్సీజన్‌ సరఫరా చేశాయని అన్నారు. మహమ్మారి సమయంలో పేద కార్మికులు రక్షించబడ్డారని, అయితే ఇద్దరు మంత్రులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పటినప్పటి నుండి కేవలం 16 లక్షల మంది మాత్రమే పింఛను ప్రయోజనాలను పొందారని, అయితే తన  నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 36 లక్షల మందికి పింఛను  అందించిందని  పేర్కొన్నారు.  కాగా,   అధికార కూటమిలో కాంగ్రెస్‌ కూడా భాగంగా ఉంది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో గత బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అన్నింటినీ నాశనం చేసిందని, ఆ సర్కారు హయంలో రైతులు మరణించారని అన్నారు. తన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కఅతజ్ఞతలు తెలిపిన ఆయన జార్ఖండ్‌ను ఢిల్లీ లేదా రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి కాకుండా గ్రామాల నుండి పరిపాలిస్తామని అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ కూడా భాగమేనన్నారు.  స్థానికులకు ఉద్యోగాల వాగ్దానాల రూపురేఖలు ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, పంజాబ్‌, హర్యానా హైకోర్టు గత నెలలో హర్యానాలో ఇదే విధమైన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది.  ఈ చట్టం వెనుక ఉన్న నేల పుత్రులు అనే భావన యజమానుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు.

➡️