Delhi High Court : కేజ్రీవాల్‌కి ఊరట

న్యూఢిల్లీ :   ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. ఇడి కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం లేదని అభిప్రాయపడినట్లు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ పి.ఎస్‌. అరోరాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టానికి లోబడి ఈ సమస్యను పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంలోని ఇతర విభాగంపై ఉందని పేర్కొంది.

పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆచరణాత్మక ఇబ్బందులు ఉండవచ్చు.. కానీ, ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. జైలు నుండి కొనసాగిస్తున్న పాలనను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘన ఉంటే రాష్ట్రపతి లేదా గవర్నర్‌ చర్యలు తీసుకుంటారని, తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

కేజ్రీవాల్‌ ఇప్పటికీ ఏ అధికారంతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రధాన కార్యదర్శి వివరణనివ్వాలని సుర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఇడి గతవారం కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వారంరోజుల ఇడి కస్టడీ నేటితో ముగియడంతో  ఆయనను  ఢిల్లీలోని రోస్‌ అవెన్యూ కోర్టులో   హాజరుపరిచింది.

➡️